Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాస్టర్ మైండ్ కు ఏమైంది?

By:  Tupaki Desk   |   26 Sept 2019 10:50 AM IST
కేసీఆర్ మాస్టర్ మైండ్ కు ఏమైంది?
X
తనకు మించిన మేధావే లేరన్నట్లుగా మాట్లాడుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అత్యద్భుతమైన పథకాల్ని రచించిన మేథోతనం తన సొంతమని.. కేంద్రం సైతం తమ పథకాల్ని కాపీ కొడుతుందని అప్పుడప్పుడు ఆగ్రహాం వ్యక్తం చేసే కేసీఆర్.. తన రాష్ట్రంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తప్పించేందుకు ఎందుకు ఆలోచన చేయరన్నది క్వశ్చన్?

గడిచిన రెండు నెలులుగా హైదరాబాద్ మహానగరాన్ని డెంగీ ఎంతలా పట్టి పీడిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మహమ్మారి పుణ్యమా అని.. సగటు జీవి బడ్జెట్ లెక్కలన్ని మొత్తంగా మారిపోయిన పరిస్థితి. ఇంట్లో ఒక్కరికి డెంగీ వచ్చినా వేలాది రూపాయిలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి.

హైదరాబాద్ లోని ప్రతి ఒక్క ఇంట్లోనూ డెంగీ దోమ ప్రభావం చూపించిన పరిస్థితి. సర్కారు దవాఖానా నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకూ అన్ని కిటకిటలాడిపోవటమే కాదు.. ఆసుపత్రిలో బెడ్లు దొరకని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ్వరం వస్తే వణికిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో... జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినంతనే డెంగీ పరీక్ష అవసరం లేకున్నా చేయించుకుంటున్నారు.

డెంగీ టెస్ట్ కు రూ.3500 ఖర్చు అవుతున్న వేళ.. ఆ మొత్తాన్ని ఖర్చు చేయలేక తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఇలాంటివేళ.. తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డెంగీ వ్యాధి నిర్దారణకు చేసే ఎలీసా టెస్టును రాయితీ మీద చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. లక్షలాదిమంది డెంగీ కారణంగా అవస్థలు పడుతున్న వేళ.. వేలాది రూపాయిలు ఖర్చును అంతో ఇంతో తగ్గించేలా ప్రభుత్వం మొదటే చర్యలు తీసుకోవాల్సింది.

మేధావి మాటకు ప్రతిరూపమైన కేసీఆర్ లాంటి వారికి సైతం ఐడియా రాకపోవటం ఏమిటన్నది క్వశ్చన్. తెలంగాణ ముఖ్యమంత్రికి రాని ఐడియాను హైకోర్టు ఇచ్చిన వేళ.. ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తుందో చూడాలి. కాలానికి మించిన వేగంతో పరుగులు తీసే మీ మాస్టర్ మైండ్ కి ఇలాంటి ఐడియా ఎందుకు తట్టనట్లు కేసీఆర్ జీ?