Begin typing your search above and press return to search.

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్‌కు పొలిటిక‌ల్ పిచ్చి.. ఏరేంజ్‌లో అంటే.. మ‌ళ్లీ దొరికిపోయాడు!

By:  Tupaki Desk   |   10 April 2023 9:49 AM GMT
తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్‌కు పొలిటిక‌ల్ పిచ్చి.. ఏరేంజ్‌లో అంటే.. మ‌ళ్లీ దొరికిపోయాడు!
X
తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావుకు పొలిటిక‌ల్ పిచ్చి ఓ రేంజ్‌లో పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌ర‌చుగా ఆయ‌న త‌న విధుల కంటే కూడా.. పొలిటిక‌ల్ కామెంట్లు ఎక్కువ‌గా చేస్తున్నార‌నే వాద‌న ఉంది.

అంతేకాదు.. ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా కూడా మారిపోయార‌ని ప్ర‌తిప‌క్షాలు కూడా గ‌తంలో విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఇక‌, కేసీఆర్ కుపాదాభివంద‌నాలు.. దండ‌లు.. ద‌ణ్ణాలకు లెక్కే లేదు. ఇలా.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌వేశం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్నిక‌లు ఉండ‌డంతో ఈ పిచ్చిని మ‌రింత పీక్‌కుతీసుకువెళ్లిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కొత్తగూడెంలో ఆయ‌న మాట్లాడుతూ.. 'కొత్త‌గూడెం గడ్డ ఉద్యమాలకు అడ్డా' అని ఎలుగెత్తారు. అంతేకాదు.. కొత్తగూడెంలో కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా ఒక్కరే రాజకీయాలు అనుభవిస్తున్నారని విమర్శించారు.

కొత్తవారికి అవకాశం ఇవ్వరా?.. మిగతావారు నాయకులు కాకూడదా? అని డీహెచ్‌ శ్రీనివాస్‌రావు ప్రశ్నించారు.త‌న సొంత ప్రాంతం .. కొత్త‌గూడెం సీటు నుండి పోటీకి ఆరాట‌ప‌డుతున్న డీహెచ్ .. నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా త‌న‌కంటూ బీఆర్ఎస్‌లో ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే గుస‌గుస కూడా వినిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారని పలు రిపోర్టులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఇప్పటికే తన కోరిక ను వ్యక్తం చేసినట్టుగా కొంతకాలం ప్రచారం నడిచింది. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఓకే అంటే.. ఉద్యోగానికి వీఆర్‌ఎస్ ఇచ్చి రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశంలో శ్రీనివాస‌రావు ఉన్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

గ‌తంలో కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదని వందసార్లైనా బరాబర్ మొక్కుతానని ప్రకటించారు. శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ ఏమో తెలియదు గానీ.. ఆయన వ్యాఖ్యల వల్ల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మ‌రి ఆయ‌న విష‌యాన్ని కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.