Begin typing your search above and press return to search.

సచివాలయ కూల్చివేతలో అత్యాధునిక బ్లాస్టింగ్ పద్దతిని వాడట్లేదెందుకు?

By:  Tupaki Desk   |   10 July 2020 4:44 AM GMT
సచివాలయ కూల్చివేతలో అత్యాధునిక బ్లాస్టింగ్ పద్దతిని వాడట్లేదెందుకు?
X
అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. ఏదైనా భారీ భవనాన్ని కుప్పకూల్చాలంటే.. సెకన్లతో పూర్తి చేసే విధానాలు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన చాలా వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇలాంటివేళ తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసే అంశానికి సంబంధించి అత్యాధునిక బ్లాస్టింగ్ విధానానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఓకే చెప్పలేదు? అన్నది ప్రశ్నగా మారింది.

భవనాల్ని కూల్చేందుకు అనువుగా ఉంటాయని చెప్పే ఇంప్లోజన్ బ్లాస్టింగ్ ప్రక్రియలకు సీఎం కేసీఆర్ ఎందుకు నో చెప్పారన్న దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సచివాలయం కూల్చివేత కోసం 2వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటే.. 500లకు పైగా కూలీలు.. పెద్ద ఎత్తున జేసీబీ యంత్రాలతో హడావుడి హడావుడి పనులు చేస్తున్నారు.

కూల్చివేత పనుల్ని తొలుత ఇంప్లోజన్ ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే.. పలువురు ఇంజనీరింగ్ నిపుణులు.. ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంప్లోజన్ పద్దతిని అనుసరిస్తే.. దగ్గర్లోని హుస్సేన్ సాగర్ కట్టకు ప్రమాదమని హెచ్చరించినట్లుగా సమాచారం. పేలుడు పదార్థాలతో భవనాల్ని ఒక్కసారిగా కూల్చేయటం అంటే.. ఒక జంతువు కాళ్లను అడ్డంగా నరికేసిన తీరులో ఉంటుందని.. అదే జరిగితే భారీగా ఉండే సచివాలయ భవనాలు ఒక్కసారిగా మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోతే.. భారీగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇది సాగర్ కు మాత్రమే కాదు.. సచివాలయానికి దగ్గర్లో ఉండే బిర్లా మందిరంతో పాటు.. పలుకట్టడాలకు ప్రమాదం వాటిల్లుతుందన్న అధికారుల అంచనాలతో కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. నిజాం హయాంలో నేల మాళిగలు ఉండటం.. సచివాలయ ప్రాంతంలో అలాంటివి గతంలోనూ బయటపడిన నేపథ్యంలో ఇంప్లోజన్ పద్దతిలో అలాంటివి దెబ్బ తినే ప్రమాదం ఉందని గుర్తించారు. అందుకే నిమిషాల్లో పూర్తి అయ్యే కూల్చివేత పనులు రోజుల తరబడి సాగినా ఫర్లేదు కానీ.. కొత్త తలనొప్పులు రాకూడదన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.