Begin typing your search above and press return to search.

టీ సర్కారుకు షాక్:అప్పు పుట్టే ఛాన్స్ లేనట్లే

By:  Tupaki Desk   |   6 Nov 2015 5:08 AM GMT
టీ సర్కారుకు షాక్:అప్పు పుట్టే ఛాన్స్ లేనట్లే
X
తమది ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇప్పుడు తల పట్టుకునే పరిస్థితి. మిగులు రాష్ట్రంగా ఉన్న తమకు అదనపు అప్పు ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నపాన్ని అందించిన సంగతి తెలిసిందే. తాము చెప్పిన దానికి కేంద్రం కానీ ఓకే అంటే.. రూ.2వేల కోట్ల వరకూ అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది.

స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 3 శాతం మేరకు అప్పు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ లాంటి మిగులు ఉన్న రాష్ట్రాలకు 3.5 శాతం అప్పు తెచ్చుకునే వీలుంది. తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి 4 లక్షల కోట్ల రూపాయిలు కావటంతో ఈ ఏడాదిలో రూ.12 వేల కోట్ల మేర అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు రూ.10వేల కోట్ల అప్పు తెచ్చుకుంది. తమకున్న సౌలభ్యంతో మరో రూ.2వేల కోట్లు అప్పు తెచ్చుకునే వీలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రధాని.. ఆర్థిక మంత్రిని కలిసి తమకు ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని సడలించి కొత్త అప్పునకు వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరింది.

ఆసక్తికరంగా తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు చిక్కుల్లో పడింది. గతంలో విద్యుత్తు బాండ్ల రూపంలో డిస్కంలు తీసుకున్న అప్పుల్ని రాష్ట్రాల ఖాతాలకు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇదంతా దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు డిస్కంల ఆర్థిక స్థితిని మెరుగు పర్చే పనిలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణతో పాటు.. తొమ్మిది రాష్ట్రాల్లోని డిస్కంలలో ఉన్న అప్పుడ బకాయిల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేయాలని ఆదేశించింది.

దీంతో అప్పు పరిమితి తెలంగాణ వరకు రూ.14,500 కోట్లకు చేరుకోనుంది. దీంతో.. కేంద్రం నుంచి రూ.2వేల కోట్లు వస్తాయని అనుకుంటే.. ఇప్పుడు ఎదురు రూ.2,500కోట్లు అప్పును తగ్గించుకోవాల్సిన పరిస్థితి. దీంతో కేంద్రం నుంచి రూ.2వేల కోట్లు వస్తాయని ఆశ పడుతున్న తెలంగాణ సర్కారుకు.. ఇప్పుడు రూ.2,500కోట్లు ఎదురు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకందని చెబుతున్నారు. ఈ అనూహ్య పరిణామం తెలంగాణ సర్కారుకు షాకివ్వటం ఖాయమంటున్నారు. అదనపు అప్పుతో రాష్ట్రంలోని పలు సంక్షేమ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలన్న లక్ష్యానికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం తూట్లు పడేలా చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.