Begin typing your search above and press return to search.

కరవు రాష్ట్రంలో జెండా కోసం రూ.1.96 కోట్లు

By:  Tupaki Desk   |   12 May 2016 5:03 AM GMT
కరవు రాష్ట్రంలో జెండా కోసం రూ.1.96 కోట్లు
X
ఖర్చు చేయటం తప్పు కాదు. కానీ.. ఆ ఖర్చు అర్థవంతంగా ఉండాలి. సమయం.. సందర్భం ఉండాలి. ఆర్భాటం కోసం చేసే కొన్ని ప్రయత్నాలు మొదటికే దెబ్బ తీసే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరవుతో కిందామీదా పడుతున్న వేళ.. అపన్న హస్తం కోసం తెలంగాణలోని పలు వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. వాటి మీద దృష్టి సారించని ముఖ్యమంత్రి కేసీఆర్.. డాబుసరి కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో మహా కట్టడాలు కడతామంటూ వరుస ప్రకటనలు చేస్తున్న కీసీఆర్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఈ భారీ జెండా ఏర్పాటు కోసం చేస్తున్న ఖర్చువివరాలు తాజాగా బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేస్తోంది. భారీ జెండా ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.96కోట్లు ఖర్చు చేయటం చూసినప్పుడు.. కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రంలో హడావుడి కోసం పెట్టే ఖర్చును ప్రజలకు సాయంగా అందించేందుకు వినియోగిస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.

లక్ష కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రంలో రూ.2కోట్లు పెద్ద విషయం కాదు. కానీ.. సమస్యల్లో ఉన్నప్పుడు.. తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్లి సాయం అడగాల్సిన సమయంలో.. హడావుడి కోసం అనవసర ఖర్చుల్ని చేసే బదులు ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ.. ఆ విషయంలో కేసీఆర్ సర్కారు రాంగ్ స్టెప్ వేసిందన్న మాట వినిపిస్తోంది.