Begin typing your search above and press return to search.

సీబీఐటీని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే..?

By:  Tupaki Desk   |   12 July 2015 2:29 AM GMT
సీబీఐటీని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే..?
X
ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల సీబీఐటీని తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుంటుందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంపీ ఒకరు గళం విప్పారు. మీడియా కథనానికి తగ్గట్లే.. సీబీఐటీని తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వాదనను తాను ఎందుకు చేస్తున్నానంటే అన్న విషయాన్ని వివరిస్తూ.. సీట్ల అమ్మకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాదిస్తున్నారు.

కళాశాల సీట్లను అమ్ముకోవటాన్ని తాను వ్యతిరేకించినందుకు తనను సీబీఐటీ కళాశాల బోర్డు నుంచి తప్పించినట్లుగా ఆరోపించిన ఆయన.. కళాశాల ఎవరి సొంత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాజా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి (టీఆర్ ఎస్) తండ్రి మాజీ చీఫ్ జస్టిస్ మాధవరెడ్డి కుమారుడే.

మరోవైపు.. అధికారపక్ష ఎంపీ వాదనను.. కళాశాలకు చెందిన కొందరు ఉద్యోగులు కూడా సమర్థిస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.400కోట్ల మేర అక్రమాలు జరుగుతున్నాయని.. కళాశాల ప్రమాణాలు కూడా పడిపోతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకొని నిర్వహిస్తే మంచిదని వాదిస్తున్నారు.

ప్రస్తుతం సీబీఐటీకి సంబంధించిన పగ్గాలు.. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ (రాజ్యసభ) సుజనా చౌదరి చేతుల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం ప్రాంతీయతతో పాటు.. రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.