Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. ఇంటికే తీసుకెళ్లి ఇవ్వనున్న కేసీఆర్ సర్కార్

By:  Tupaki Desk   |   24 Aug 2020 11:30 PM GMT
కరోనా వేళ.. ఇంటికే తీసుకెళ్లి ఇవ్వనున్న కేసీఆర్ సర్కార్
X
భావోద్వేగాన్ని తట్టి లేపటమే కాదు.. మహిళల మనసుల్ని దోచుకునేలా చేసే పథకాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒకటిగా చెప్పాలి. మొదటి రెండు సంవత్సరాలు ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఇబ్బందులకు గురైనప్పటికి.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. బతుకమ్మ వేళకు.. ప్రభుత్వం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు చీరలు అందటం ఒక అలవాటుగా మారింది.

మొదట్లో నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు భారీగా రావటం.. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. వీటిని సరిదిద్దటంలో తెలంగాణ సర్కారు సక్సెస్ అయ్యింది. ప్రతి ఏటా బతుకమ్మ సందర్భంగా కోటి మంది పేద మహిళలకు చీరల్ని పండుగ బహుమతిగా ఇస్తున్నారు. బతుకమ్మ సంబురాలకు వారం.. పది రోజుల ముందే సర్కారు వారి సారె.. పేద మహిళల ఇంటికి వెళ్లటం తెలిసిందే.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరి.. బతుకమ్మ చీరల్ని ఈసారికి ఇస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ లలో ఒకటైన.. ఈ పథకం అమలుకు కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన ఈ చీరల్ని.. కార్డులు తీసుకెళితే ఇచ్చేవారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా నేపథ్యంలో అర్హులైన మహిళల ఇళ్లకు నేరుగా వెళ్లి.. చీరలు ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

పథకం అమలు కోసం నగర.. మున్సిపాలిటీ.. పంచాయితీల పరిధిలోని సిబ్బంది.. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చీరల పంపిణీని ఇంటి గుమ్మం వద్దకే తీసుకెళ్లాలని నిర్ణయించారు. రేషన్ రిజిస్టర్లు.. ఆహార భద్రతా కార్డుల్ని చెక్ చేసి చీరల్ని ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి చీరల్ని ఎలా డెలివరీ చేయాలన్న అంశంపై సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. చీరల పంపిణీ డోర్ డెలివరీ చేయటం కేసీఆర్ సర్కారుకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.