Begin typing your search above and press return to search.

తెలంగాణ క‌రెంటు : ఓ చేదు నిజం

By:  Tupaki Desk   |   24 Oct 2015 5:06 AM GMT
తెలంగాణ క‌రెంటు : ఓ చేదు నిజం
X
ఏదైనా వస్తువు కొనేముందు నాణ్యతతోపాటు దాని ధరను సాధారణంగా చూస్తారు. కానీ తెలంగాణ‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఛత్తీస్‌ గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో నియమ, నిబంధనలన్నీ పొందుపర్చారు. అయితే యూనిట్‌ రేటును మాత్రం ప్రస్తావించలేదు. దీన్ని ప్ర‌శ్నించినందుకు తెలంగాణ కోసం పోరాడిన ఓ ఉద్య‌మ‌కారుడికి మెమో జారీచేసేందుకు సిద్ధ‌మ‌యింది. ఇపుడు ఈ విష‌యం తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారింది.

గతంలో ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న పరస్పర అంగీకార ఒప్పందానికి (ఎమ్‌ ఓయు), ఇరు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు (పీపీఏ) మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. దీర్ఘకాల ఒప్పందాల ప్రకారం విద్యుత్‌ ను కొనుగోలు చేసేటప్పుడు సహజంగా ఏ ఏడాది ఎంత ధర చెల్లించాలనే అంశాలు పీపీఏలో ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఛత్తీస్‌ గఢ్‌ తో ఒప్పందం జరిగింది. యూనిట్‌ రేటును ఆ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణా మండలి నిర్ణయించిన ప్రకారం సరఫరా చేస్తామని ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ పీపీఏలో పేర్కొంది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఎమ్‌ ఓయు, విద్యుత్‌ సంస్థల పిపిఏలపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈనెల 20వ తేదీలోపు తమకు రాతపూర్వకంగా ఇవ్వాలని పేర్కొంటూ టీఎస్ ఈఆర్‌ సీ పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చింది.

అయితే యూనిట్‌ రేటు లేకుండా ఏం సూచనలు చేయాలనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పీపీఏను గతంలో ఎప్పుడూ చూడలేదని విద్యుత్‌రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. వాణిజ్య నిర్వహణ తేదీ (సిఓడి) నుంచే యూనిట్‌ ఛార్జీని నిర్ధారిస్తామని ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు వార్ధా నుంచి మహేశ్వరం విద్యుత్‌ లైన్ల పనులు పూర్తికాలేదు. 2016 డిసెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తవుతాయని, కేవలం కారిడార్‌ బుకింగ్‌ కోసమే పీపీఏ కుదుర్చుకున్నామని కేసీఆర్‌ ప్రకటించారు. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా అవతరిస్తామని పేర్కొన్నారు. అలాంటప్పుడు 12 ఏళ్ల పాటు ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వంతో దీర్ఘకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఎందుకని విద్యుత్‌ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థతో మన రాష్ట్ర డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏ లోపభూయిష్టంగా ఉందని విద్యుత్‌ రంగ నిపుణుడు, ఆ ఉద్యోగుల సంఘం నాయ‌కుడు కె రఘు మీడియాతో అభిప్రాయపడ్డారు. పీపీఏ, ఎంఓయూల్లో ఎలాంటి వివరాలు లేకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని టిఎస్‌ ఇఆర్‌ సి కోరడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై బహిరంగ విచారణ నిర్వహించాలని కోరారు. ఈ ఒప్పందంలోని అనేక క్లాజులు తెలంగాణ‌ రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా, ఆర్ధిక‌ భారం మోపేవిగా ఉన్నాయని చెప్పారు. యూనిట్‌ రేటును ప్రస్తావన లేదని, కెపాసిటీ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు మాత్రం పేర్కొన్నారని తెలిపారు. యూనిట్‌ రేటు రూ.5తో లెక్కించినా ఈ కొనుగోలు భారం ఏడాదికి రూ.4,380 కోట్లు అవుతుందని తెలిపారు.

అయితే మీడియాలో ర‌ఘు వ్యాఖ్య‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌నకు త్వ‌ర‌లో నోటీసులు జారీచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేవిధంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌నకు శ్రీ‌ముఖం పంప‌డం ఇపుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ర‌ఘుకు, అదికూడా తెలంగాణ ప్ర‌జ‌ల మేలుకోసం మాట్లాడితే టార్గెట్ చేయ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.