Begin typing your search above and press return to search.

జీతాలివ్వ‌లేం..ఆర్టీసీ కార్మికుల‌కు తెలంగాణ ఉత్త‌చేతులు..

By:  Tupaki Desk   |   22 Oct 2019 9:36 AM GMT
జీతాలివ్వ‌లేం..ఆర్టీసీ కార్మికుల‌కు తెలంగాణ ఉత్త‌చేతులు..
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ప్ర‌భుత్వం చాలా చిత్రంగా స్పందించింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ సోమ‌వారం(నిన్న‌ - 21వ తేదీ)నాటికి ఖ‌చ్చితంగా స్పందించాల‌ని - కార్మికుల వేత‌నాల‌ను ఇచ్చి తీరాల‌ని సాక్షాత్తూ హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో దాదాపు 50 వేల మంది కార్మికుల్లో ఆనందం ఏర్ప డింది. ఎలాగూ డ‌బ్బులు లేక ద‌స‌రా పండ‌గ చేసుకోలేక పోయాం కాబ‌ట్టి.. ఇప్పుడు క‌నీసం హైకోర్టు తీర్పు తో అయినా.. జీతాలు వ‌స్తే.. దీపావ‌ళి అయినా జ‌రుపుకొంటామ‌ని భావించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం ఎక్క‌డా దిగి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

తాజాగా ఇదే విష‌యంపై ఆర్టీసీ ఎండీ సునీల్‌ శ‌ర్మ హైకోర్టులో కౌంట‌ర్ పిటిష‌న్ వేశారు. జీతాలు చెల్లించే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. స‌మ్మె కార‌ణంగా రాష్ట్ర ర‌వాణా సంస్థ‌కు రూ.125 కోట్ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం సంస్థ ద‌గ్గ‌ర కేవ‌లం 7.5 కోట్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని కోర్టుకు తెలిపారు. జీతాలు చెల్లించేందుకు 140 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని - అంత డ‌బ్బు త‌మ ద‌గ్గ‌ర లేద‌ని కౌంట‌ర్ పిటిష‌న్‌ లో కోర్టుకు వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర ఆర్టీసీ ప‌రిస్థితిని ఆయ‌న కోర్టుకు వివ‌రించారు.

రాష్ట్ర ఆర్టీసీ ద్వారా ఏడాదికి వ‌చ్చే ఆదాయం.. 4882 కోట్లు - ఖ‌ర్చు 5269 కోట్లుగా ఉంద‌ని తెలిపారు. ఇక‌, ఏటా 1200 కోట్ల మేర‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్నారు. అయితే, కోర్టులో కార్మికుల ప‌క్షాన ఉన్న న్యాయ‌వాది కూడా గ‌ట్టిగానే వాదించారు. ప్ర‌భుత్వం - ఆర్టీసీ ఎండీ చెబుతున్న‌దంతా కూడా అసంబ‌ద్ధ‌మైన వాద‌న‌గా పేర్కొన్నారు. స‌మ్మె స‌మయంలో కూడా ప్ర‌భుత్వానికి న‌ష్టాలు రాలేద‌ని, 70 శాతం బస్సులు రోడ్డెక్కాయ‌ని ప్ర‌బుత్వ‌మే చెప్పింద‌ని కార్మికుల ప‌క్షాన న్యాయ‌వాది వాదించారు.

అధికారుల‌కు రు. 100 కోట్లు జీతాల రూపంలో చెల్లించార‌ని తెలిపారు. కార్మికులపై క‌క్ష గ‌ట్టిన ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌లు విన్న ధ‌ర్మాస‌నం ఎలాంటి తీర్పు ఇస్తుందో ఎలా దిశానిర్దేశం చేస్తుందో చూడాలి.