Begin typing your search above and press return to search.

కేసీఆర్ 17 జిల్లాలు చేద్దామని డిసైడ్ అయ్యారు

By:  Tupaki Desk   |   18 Aug 2016 5:14 AM GMT
కేసీఆర్ 17 జిల్లాలు చేద్దామని డిసైడ్ అయ్యారు
X
రాజు తలుచుకుంటే జరగనిదేమిటి? కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ కావటం.. దసరా నాటికి కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ కావటం తెలిసిందే. అందుకు తగ్గట్లే పరిణామాలు వేగంగా మారిపోయాయి. మొన్నటికి మొన్న 14 కొత్త జిల్లాలు సరిపోతాయని భావించిన కేసీఆర్ మైండ్ సెట్ కు తగ్గట్లే పనులు సాగుతుండగా.. తాజాగా ఆయన అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటివరకూ 14 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అనుకోవటం.. అందుకు తగ్గట్లే మంత్రివర్గ ఉప సంఘం సైతం ఓకే చెప్పేసింది. ముఖ్యమంత్రి నిర్ణయానికి తగ్గట్లే 14 కొత్త జిల్లాలకు ఓకే చెబుతూ సిఫార్సు చేసింది. అంతేకాదు.. 14కు మించి కొత్త జిల్లాలు సాధ్యం కాదంటూ తేల్చేసింది కూడా. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మనసు మారింది. కొత్త జిల్లాలు 14 కాదు 17 చేయాలన్న తన ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. సీఎం మనసు మారాక అందుకు తగ్గట్లు పరిణామాలు వేగంగా మారాయి. తన మారిన మనసుకు తగ్గట్లుగా నిర్ణయాన్ని తీసుకోవటానికి వీలుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ మహమూద్ అలీ.. విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ.. భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్.. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర.. సీఎంవో అధికారులు నర్సింగ్ రావు.. స్మితా సబర్వాల్.. రాజశేఖర్ రెడ్డి తదితరులతో కూడిన బృందం సమావేశమైంది. మారిన ముఖ్యమంత్రి మైండ్ సెట్ కు తగ్గట్లుగా మరో మూడు జిల్లాలు పెంచాలన్న అంశంపై చర్చించారు.

దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ మీటింగ్ లో ఇప్పటివరకూ జరిగిన కొత్త జిల్లాల కసరత్తు అంశాలతో పాటు.. మరో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుపై కేసీఆర్ తనకొచ్చిన తాజా ఆలోచనల్ని పంచుకున్నారు. అధినేత మనసుకు తగ్గట్లు వ్యవహరించేందుకు సహచరులు.. అధికార యంత్రాంగం ఓకే చెప్పేయటంతో కొత్త జిల్లాల సంఖ్యను 14 నుంచి 17కు పెంచుతూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై త్వరలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు.

తాజాగా తెరపైకి వచ్చిన మూడు కొత్తజిల్లాల విషయానికి వస్తే.. వరంగల్.. కరీంనగర్.. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి.. మొత్తంగా మూడు కొత్త జిల్లాలు తెర మీదకు వచ్చేశాయి. దీంతో.. ఇప్పటి వరకూ అనుకున్న 24 జిల్లాలు కాస్తా 27 జిల్లాలు కానున్నాయి. కొత్తగా వచ్చి చేరిన మూడు జిల్లాలకు తగినట్లే రెవెన్యూ డివిజన్లను44 నుంచి 58కి.. మండలాలను 459 నుంచి 533కి పెంచేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాలపై ఈ నెల 20న అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం. జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ఆధారంగానే కొత్త జిల్లాల ఏర్పాటు చూడాలన్న మాటకు భిన్నంగా జనాభా ప్రాతిపదికనే కొత్తగా మూడు జిల్లాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన హైదరాబాద్ రెండు జిల్లాల్లో 83 లక్షల జనాభా.. వరంగల్ లో22 లక్షల జనాభా.. కరీంనగర్జిల్లాలో 15 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో.. జిల్లాల మధ్య జనాభా వైరుధ్యం ఇంతగా ఉండకూడదని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అందుకే.. కొత్తగా మరో మూడు జిల్లాల్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకూ హైదరాబాద్.. రంగారెడ్డి.. సికింద్రాబాద్ జిల్లాలు అనుకోగా.. మారిన ముఖ్యమంత్రి నిర్ణయంతో రంగారెడ్డి.. హైదరాబాద్.. మల్కాజ్ గిరి.. శంషాబాద్ జిల్లాల్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. సికింద్రాబాద్ జిల్లా ప్రతిపాదన మరుగన పడిపోయినట్లే. తాజా ఆలోచన ప్రకారం మహబూబ్ నగర్ లోని షాద్ నగర్ ను శంషాబాద్ జిల్లాలో కలిపే వీలుందంటున్నారు. ఇక.. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్.. జగిత్యాలతో పాటు కొత్తగా పెద్దపల్లి జిల్లాను ప్రతిపాదించారు. ఇక.. వరంగల్.. మహబూబాబాద్.. భూపాల పల్లితో పాటు తాజాగా హన్మకొండ జిల్లాను ప్రతిపాదించారు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ సెట్ కు తగ్గట్లుగా తెలంగాణ రాష్ట్రం 24 జిల్లాలు కాస్తా 27 జిల్లాలు కానుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకోవాలే కానీ.. అడ్డుకునే వారెవరు ఉండరు కదా.