Begin typing your search above and press return to search.

ఛేజింగ్ సీన్లకు ‘టీ’ సర్కారు కత్తెర?

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:36 AM GMT
ఛేజింగ్ సీన్లకు ‘టీ’ సర్కారు కత్తెర?
X
తెలుగు సినిమాల్లో ఛేజింగ్ సీన్లు సర్వ సాధారణం. ఇలాంటి సీన్ల వల్లే యువత తీవ్రంగా ప్రభావితమై.. ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించటం లేదన్న భావన వ్యక్తం చేస్తోంది తెలంగాణ రవాణా శాఖ. అందుకే.. సినిమాల్లో ఛేజింగ్ సీన్లకు కత్తెర వేయాలన్న ఆలోచనలో ఉంది తెలంగాణ రవాణా శాఖ.

సినిమాల్లో వచ్చే ఛేజింగ్ సీన్లు అన్నవి లేకుండా చేయాలని.. ఈ ఛేజింగ్ సీన్ల పుణ్యమా అని.. 15 నుంచి 30 ఏళ్ల వయస్కులు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పట్టించుకోకుండా రోడ్ల మీద చెలరేగిపోతున్నారని.. దీనికి కారణం.. సినిమాల్లోని యాక్షన్ సీన్లుగా రవాణా శాఖ భావిస్తోంది. అందుకే.. ఇలాంటి సీన్లు సినిమాల్లో లేకుండా చేస్తే సరిపోతుందన్న భావన వ్యక్తం చేస్తోంది. ఇష్టారాజ్యంగా వాహనాల్ని నడిపే వారి కారణంగా భారీగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. ఈ ప్రభావం నుంచి యూత్ ను రక్షించాలంటే సినిమాల్లో ఇలాంటి సీన్లకు కత్తెర వేయాల్సిందేనని వారు భావిస్తున్నారు.

సినిమా అన్నాక విలన్.. హీరోల మధ్య కొట్లాట తప్పనిసరి. ఇందులో భాగంగా ఛేజింగ్ సీన్లు మామూలే. మరి.. తెలంగాణ రవాణా శాఖ సూచనతో తెలంగాణ సర్కారు కానీ సినిమాల్లో ఛేజింగ్ సీన్లకు కత్తెర వేస్తే.. సినిమాల్లో యాక్షన్ మజా మిస్ కావటం ఖాయం. మరి.. తెలంగాణ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటుందా..?