Begin typing your search above and press return to search.

హైదరాబాదులో మరిన్ని సైబర్ టవర్స్ !

By:  Tupaki Desk   |   29 March 2016 6:16 AM GMT
హైదరాబాదులో మరిన్ని సైబర్ టవర్స్ !
X
హైదరాబాద్ అంటే ముత్యాల నగరమన్న పేరు ఒకప్పటిది. ఆ తర్వాత కాలంలో హైటెక్ సిటీగా.. ఐటీ నగరిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. హైదరాబాద్ నగరి రూపురేఖల్ని మార్చేయటం.. వరల్డ్ క్లాస్ సిటీగా మార్చటంతో పాటు.. ఇప్పటివరకూ ఐటీ అంటే కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మాదాపూర్.. గచ్చిబౌలి ప్రాంతాలు మాత్రమేనన్న భావనను తొలగించటం.. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ పార్కుల్ని విస్తరించాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ప్రణాళికలు తయారు చేసింది.

పెద్ద పెద్ద కంపెనీలతో పాటు.. చిన్నచితకా ఐటీ కంపెనీలకు గుర్తింపు ఇవ్వటం, వాటన్నింటిని ఒకే చోటుకు తీసుకురావడం వంటి ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ సర్కారు. ఇందులో భాగంగా సైబర్ టవర్స్ మాదిరి మరిన్ని భారీ టవర్స్ ను నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. మరో వారంలో నూతన ఐటీ విధానంలో భాగంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

హైదరాబాద్ లోని ఐటీ రంగంలో పెద్ద కంపెనీల వాటా 30 శాతం మాత్రమేనని.. మిగిలిన 70 శాతం చిన్న.. సూక్ష్మ తరహా ఐటీ సంస్థలదేనని.. అలాంటి వాటిని మరింత ప్రోత్సాహం అందించటం ద్వారా.. ఐటీ సేవల్ని మరింత విస్తృతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా చిన్న.. సూక్ష్మ తరహా కంపెనీలకు మరిన్ని మౌలిక వసతులు.. ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కొత్త ప్రాంగణాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సైబర్ టవర్స్ మాదిరి భారీ భవనాల్ని ఏర్పాటు చేసి.. అందులో ఈ సంస్థలకు లీజుకు ఇవ్వాలని భావిస్తోంది. ఇలా చేయటం వల్ల ఆయా కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు కావటంతో పాటు.. వారి బ్రాండ్ కు మరింత ప్రాధాన్యత వచ్చేలా సాయపడాలని భావిస్తోంది.

ఇక.. ఐటీ అంటే.. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమన్న భావన స్థానే.. హైదరాబాద్ లో మరింతగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఐటీ కారిడార్ ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఔటర్ పరిసరాల్లో ఐటీ పార్కులకు అనువైన స్థలాల్ని గుర్తించి.. అక్కడ ఐటీ పార్కులు ఏర్పాటు చేయటం ద్వారా హైదరాబాద్ మహానగరిని మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. అవసరమైతే ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.