Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారు ప‌రువు తీసిన ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:25 AM GMT
కేసీఆర్ స‌ర్కారు ప‌రువు తీసిన ప్ర‌క‌ట‌న‌!
X
ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నిని గొప్ప‌గా చెప్పుకోవ‌టానికి త‌యారు చేసిన ప్ర‌క‌ట‌న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రువును తీయ‌ట‌మే కాదు.. సీఎం కేసీఆర్ ను ఇరుకున ప‌డేలా చేసింది. త‌న అనుమ‌తి లేకుండా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లో త‌న ఫోటోను ప్ర‌చురించ‌టం ఒక ఎత్తు అయితే.. త‌న భ‌ర్త‌ను కాని వ్య‌క్తిని త‌న భ‌ర్త‌గా మార్చి ఫోటో వేయ‌టంలో న్యాయం ఏమిటంటూ ప‌ద్మ అనే గృహ‌ణి వాపోతున్న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

తెలంగాణ ప్ర‌భుత్వానికి చికాకు పెడుతున్న ఈ ఉదంతంలోకి వెళితే..ఇటీవ‌ల రెండు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్ని ఘ‌నంగా ప్రారంభించిన వైనం తెలిసిందే. ఆరోగ్య బీమాతో పాటు.. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా షురూ చేసింది.

ఈ సంద‌ర్భంగా అన్ని ప‌త్రిక‌ల్లోనూ భారీగా జాకెట్ యాడ్స్ ను ఇచ్చింది. అయితే.. ఈ రెండు ప‌థ‌కాల ల‌బ్థిదారాలుగా ఒక మ‌హిళ ఫోటోను ప్ర‌ముఖంగా అచ్చేశారు. అంతా బాగానే ఉన్నా.. ఆరోగ్య బీమా ప్ర‌క‌ట‌న‌లో భ‌ర్త‌తో దిగిన ఫోటోను ప్ర‌చారానికి వాడుకోగా.. కంటివెలుగు ప్ర‌క‌ట‌న‌లో అదే మ‌హిళ‌ను మ‌రొక‌రి భార్య‌గా చూపించ‌టంపై ఆమె ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లైన రోజునే.. రెండు ఫోటోల్లో ఒకే మ‌హిళ‌.. వేర్వేరు వ్య‌క్తుల భార్య‌గా ఎలా చూపిస్తారన్న ప్ర‌శ్న‌ల్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా సంధించారు.ఈ ప్ర‌శ్న‌ల పోస్టులు వైర‌ల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. ఆ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌చురించిన మ‌హిళ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌భుత్వాన్ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు.

త‌మ‌ది సూర్యాపేట జిల్లా కోదాడ మండ‌లం తొగ్రాయి అని చెప్పిన ప‌ద్మ‌.. కుటుంబ పోష‌ణ నిమిత్తం పాత బ‌ట్ట‌లు కుట్టి అమ్ముకొని జీవ‌నం సాగిస్తామ‌ని పేర్కొన్నారు. అయితే.. తన‌ను వేరొక‌రి భార్య‌గా చూపించి త‌న ప‌రువు తీశార‌ని.. కుటుంబ స‌భ్యుల‌తో పాటు..బంధువ‌ర్గాల్లో త‌లెత్తుకోలేక‌పోతున్న‌ట్లుగా ఆమె వాపోతున్నారు. ఈ ప్ర‌క‌ట‌న పేప‌ర్లో అచ్చేసిన రోజు నుంచి త‌న అత్త‌మామ‌లు త‌న‌తో మాట్లాడ‌టం లేద‌ని.. ఎప్పుడూ లేని విధంగా ఇంట్లో గొడ‌వ‌లు అవుతున్న‌ట్లుగా ఆమె చెబుతున్నారు. యాద‌గిరి స‌మీపంలోని కొంగ‌వ‌ల్లి గ్రామంలో ఉంటున్న స‌మ‌యంలో కొంద‌రు వ‌చ్చి ప్ర‌భుత్వ అధికారుల‌మ‌ని.. లోన్లు ఇప్పిస్తామ‌ని చెప్పి ఫోటోలు తీసుకున్నార‌ని చెప్పారు. మూడేళ్ల క్రితం వ‌చ్చిన ఫోటోల్ని ర‌క‌ర‌కాలుగా వాడుతున్న‌ట్లు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

తాము కాపు సారా కాసేవార‌మ‌ని.. అది తాగుతామ‌ని.. ఇప్పుడు సారా కాయ‌టం ఆపేసి కుటుంబంతో ఆనందంగా బతుకుతున్న‌ట్లుగా త‌న భ‌ర్త‌తో ఉన్న ఫోటో తొలిసారిగా ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌గా వ‌చ్చింద‌న్నారు. తాజాగా.. త‌న భ‌ర్త స్థానంలో వేరొక‌రి ఫోటోతో పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని.. త‌న అనుమ‌తి లేకుండా అలా ఎలా చేస్తార‌ని ఆమె నిల‌దీస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ ముద‌ర‌టంతో ప్ర‌భుత్వం ఇరుకున ప‌డింది. జ‌రిగిన త‌ప్పును త‌ప్పుగా వెల్ల‌డించి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పి.. ఏదైనా సాయాన్ని ప్ర‌క‌టిస్తే ఈ ఇష్యూ అక్క‌డితో ముగిసేది. కానీ.. జ‌రిగిన త‌ప్పు ఎక్క‌డన్న విష‌యంపై విచారించాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బాధితురాలి వాద‌న‌ను చూస్తే.. అయ్యో అనిపించ‌క మాన‌దు. త‌న భ‌ర్తకు బ‌దులు మ‌రొక‌రి భార్య‌గా ప్ర‌చురించ‌టంతో ప్ర‌తి ఒక్క‌రూ గేలి చేసి మాట్లాడుతున్నారంటూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. అత్త‌మామ‌లు.. గ్రామస్తుల సూటిపోటి మాట‌ల్ని తాను త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్లుగా ఆమె వాపోయారు. త‌మ‌కు అస‌లు పొల‌మే లేద‌ని.. కేవ‌లం.. రేష‌న్ ఆధార్ కార్డులు మాత్ర‌మే ఉన్నాయ‌ని.. సెంటు భూమీ లేకున్నా రైతుబంధు చెక్కులు అందుకున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న వేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌చార క‌క్కుర్తి ఏమో కానీ.. ఒక సామాన్యుడి కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.