Begin typing your search above and press return to search.

లాస్ట్ ఛాన్స్ కు అధికారిక ఉత్తర్వులు వచ్చేశాయి

By:  Tupaki Desk   |   1 Nov 2015 4:15 AM GMT
లాస్ట్ ఛాన్స్ కు అధికారిక ఉత్తర్వులు వచ్చేశాయి
X
తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని లక్షలాది మంది ఎంతో ఆసక్తిగా.. అతృతగా ఎదురుచూస్తున్న ఒక అధికారిక ఉత్తర్వు శనివారం రాత్రి విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఔట్లు.. అక్రమ నిర్మాణాలు.. ఇలా అవీ ఇవీ అన్న తేడా లేకుండా (షరతులు వర్తిస్తాయి) అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను సక్రమం చేసుకోవటం.. లే ఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి ఉత్తర్వులు పలుమార్లు జారీ అయినా.. అవన్నీ కూడా పరిమిత కాలంలో లోపు మాత్రమే నిర్మాణం అయిన వాటికి మాత్రమే అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా.. అక్టోబరు 28, 2015 నాటి వరకూ ఉన్న అన్నీ అక్రమ కట్టడాలు.. లేఔట్లను క్రమబద్ధీకరించుకునే అరుదైన అవకాశాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని చట్టాల్ని తెలంగాణ చట్టాలుగా మార్పులు చేసి.. ఉత్తర్వులు జారీ చేశారు.

క్రమబద్ధీకరణకు సంబంధించి శనివారం రాత్రి కేవలం అధికారిక ఉత్తర్వులు జారీ కాగా.. రెండు.. మూడు రోజుల వ్యవధిలో విధివిధానాల మొదలు.. క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తం.. గడువు తేదీ తదితర వివరాలన్నీ తెలియజేస్తూ సమగ్ర జీవోను జారీ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ అన్న అక్రమ కట్టడాలు.. లేఔట్లకు ఇదే తుది గడువు అని.. ఈ గడువు లోపు అక్రమాల్ని సక్రమం చేసుకోని పక్షంలో కూల్చివేయటం ఖాయమన్న మాటను గత కొద్ది రోజులుగా తెలంగాణ సర్కారు చెప్పటం తెలిసిందే. ఏది ఏమైనా క్రమబద్ధీకరణకు సంబంధించి ఇదే లాస్ట్ ఛాన్స్ గా అధికారులు చెబుతున్నారు.