Begin typing your search above and press return to search.

సార్ ను ప్రజలు గుర్తించారు కానీ..

By:  Tupaki Desk   |   22 Jun 2016 7:09 AM GMT
సార్ ను ప్రజలు గుర్తించారు కానీ..
X
తెలంగాణవాదులు ఎంత చైతన్యవంతులన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే చెబుతుంది. మరి.. అలాంటి చైతన్యవంతులు సైతం ఇప్పుడు మౌనముద్రను దాల్చారా? అన్న ప్రశ్న పలువురిని వెంటాడి వేధిస్తోంది. మంగళవారం(జూన్ 21)నాడు తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూసినప్పుడు ఈ భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల దశాబ్దాల తరబడి ఉన్నా.. ఆ కలకు కొత్త ఆశల్ని కల్పించింది.. కొంగొత్త ఆశయాల్ని జత చేసింది ప్రొఫెసర్ జయశంకర్ అన్న విషయాన్ని మర్చిపోలేం. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన జయశంకర్ మాష్టారి వర్థంతి తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరిగింది? అన్న ప్రశ్న వేసుకుంటే.. ప్రతి తెలంగాణవాది నిరాశ చెందేవాడే.

ఉమ్మడి రాష్ట్రంలో జయశంకర్ సారును గుర్తించింది లేదు. సీమాంధ్రులు ఆయన్ను శత్రువుగానే చూశారు. లాజిక్ గా చూస్తే అందులో తప్పు లేదు కూడా. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ పార్టీ నేతృత్వంలోని సర్కారు జయశంకర్ సారు వర్థంతిని నిర్వహించిన తీరును చూసినప్పుడు గుండె కలుక్కుమనకమానదు. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో.. తెలంగాణ సిద్ధాంతకర్త వర్థంతి నిర్వహించేది ఇలానేనా? అన్నది అసలు ప్రశ్న.

అలా అని ప్రభుత్వానికి వేడుకలు నిర్వహించటం చేతకాదా? అంటే.. గడిచిన రెండేళ్ల వ్యవధిలో తానేంటో ప్రపంచానికి చాటి చెప్పేలా ఎన్నో కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాంటి ప్రభుత్వం సారు విషయాన్నిపెద్దగా పట్టనట్లుగా వ్యవహరించిందనే చెప్పాలి. ఉద్యమకారులు.. మేధావులు.. కొంతమంది స్వేచ్ఛాప్రియులు తమకు నచ్చిన.. తమకు తోచినట్లుగా వర్థంతి కార్యక్రమాల్ని నిర్వహించారు. అంతేకానీ.. సారు పేరు చెప్పి ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఉద్యమ నాయకుడి ప్రభుత్వం మాత్రం.. సారు ఆలోచనల్ని.. ఆయన భావజాలాన్ని.. ఆయన సిద్ధాంతాల్ని గుర్తు చేసి.. వాటికి తాము సైతం కంకణ బద్ధులమై ఉంటామన్న మాటను చెప్పకపోవటమే అసలుసిసలు విషాదంగా చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. చాలామంది ఉద్యమ నేతలు చెప్పినట్లుగా సార్ ను ప్రజలు ఏనాడో గుర్తించారని. కానీ.. అది సరిపోదు కదా.. భావితరాలకు సారు గొప్పతనం తెలియాలంటే ప్రభుత్వం దాన్ని టేకప్ చేయాలి కదా? సొంత రాష్ట్రంలో సారును గుర్తు చేసుకోవటానికి కూడా ఆచితూచి వ్యవహరించాల్సిందేనా..?