Begin typing your search above and press return to search.

40 వేల కోట్లు కాస్తా 83వేల కోట్లు అయ్యిందా?

By:  Tupaki Desk   |   5 March 2016 4:19 AM GMT
40 వేల కోట్లు కాస్తా 83వేల కోట్లు అయ్యిందా?
X
ఒక్క ప్రాజెక్టు కట్టేందుకు రూ.83వేల కోట్లా? తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అంచనా వ్యయం గుబులు రేపుతోంది. మొత్తం కలిపితే వార్షిక బడ్జెట్ రూ.1.4 లక్షల కోట్లు దాటని ఒక రాష్ట్రం ఏకంగా రూ.83వేల కోట్లతో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వెచ్చించటమా? అది సాధ్యమయ్యే వ్యవహారమేనా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాజెక్టు రీ డిజైనింగ్ పుణ్యమా అని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రోజులు గడిచే కొద్ది.. పెరిగిపోతోంది. తొలుత ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే దీని వ్యయం రూ.40వేల కోట్లుగా అంచనా వేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే.. ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి చేయటం సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటిది విభజన తర్వాత.. ప్రాణహిత ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కారు దీన్ని ఏ విధంగానైనా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేర్పులు చేప్టటటంతో దీని అంచనా వ్యయం అంచనాలకు అందని రీతిలో భారీగా పెరిగిపోయింది.

భూసేకరణ.. పునరావాసం.. డిజైన్ లో మార్పు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేలా చేసిందని భావిస్తున్నారు. 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అనుకున్నప్పుడు దీని అంచనా వ్యయం రూ.38,500 కోట్లుగా అనుకున్నారు. టెండర్లు ఖారారు నాటికి ఈ మొత్తానికి ఫిక్స్ అయ్యారు. ఆదే ఏడాది సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించే నాటికి ఈ అంచనా రూ.40,300కోట్లుగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయాలని నిర్ణయించారు.

తొలుత 56 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు పెంచారు. దీంతో.. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగి.. ఇప్పుడు రూ.83వేల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు భారీ భారంగా మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంత భారీ మొత్తం ఒకే ఒక ప్రాజెక్టుకు ఖర్చు చేయటమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత సంపన్న రాష్ట్రమైతే మాత్రం ఒక్క ప్రాజెక్టు కోసం రూ.83వేల కోట్ల ఖర్చా?..ఇంత భారీ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రం భరించగలదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.