Begin typing your search above and press return to search.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేనట్లే

By:  Tupaki Desk   |   25 Aug 2015 10:01 AM GMT
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేనట్లే
X
తెలంగాణలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేనట్లేనని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. వారికి జీతాలను పెంచడం ద్వారా క్రమబద్ధీకరణకు చరమ గీతం పాడాలని భావిస్తోంది. ఇప్పుడు జీతాలు పెంచడంతోపాటు రాబోయే నోటిఫికేషన్లలో గ్రేస్ మార్కులను ఇవ్వడం ద్వారా క్రమబద్ధీకరణ గండం నుంచి గట్టెక్కాలని భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే.. అందులో తాము అధికారం చేపట్టిన వెంటనే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టు ఉద్యోగి కూడా ఉండడానికి వీల్లేదని ఆయన శపథం పట్టారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారు అయింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికంటే కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ పెంచిన నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వంపై భారీ భారమే పడనుంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణకు చాపచుట్టేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రాబోయే నోటిఫికేషన్లలో వారికి గ్రేస్ మార్కులతోపాటు ప్రాయారిటీ ఇవ్వాలని భావించింది.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను చాప చుట్టేయడానికే కొద్ది కాలంగా వ్యవూహాత్మకంగా పావులు కదుపుతోంది. వారి జీతాల పెంపు ఫైలును తిరస్కరించినట్లు, మళ్లీ స్వీకరించినట్లుచెబుతూ వస్తోంది. తాజాగా కేటీఆర్, ఈటెల సల హా మేరకు వారికి జీతాల పెంపునకు అంగీకరించినట్లు సంకేతాలు ఇస్తోంది. జీతాలను పెంచితే ఇక క్రమబద్ధీకరణపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.