Begin typing your search above and press return to search.

నయీం కేసులో అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   1 Nov 2016 9:37 AM GMT
నయీం కేసులో అస‌లేం జ‌రుగుతోంది?
X
గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్ కేసులో తెలంగాణ ప్ర‌భుత్వంపై కొత్త సందేహాలు మొద‌ల‌య్యాయి. పెద్ద ఎత్తున ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌నుకున్న‌ది కాస్త చ‌ప్ప‌గా సాగుతుండ‌టంతో నయీం కేసు అటకెక్కిందా అనే సందేహం ప‌లువురిలో కలుగుతోంది. న‌యీంతో అంటకాగిన వారిలో బడాబాబుల పేర్లు బయటికి వస్తాయా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతుండ‌టం తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారు విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నిస్తోంది. హైకోర్టుకు అందజేసిన నివేదికలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ నేతి విద్యాసాగర్‌ రావు - టీఆర్‌ ఎస్‌ నేత చింత వెంకటేశ్వర్‌ రెడ్డి పేర్లు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో సిట్‌ మీనమేషాలు లెక్కబెడుతోందన్న అపవాదును సిట్‌ ఎదుర్కొంటున్నది. ఈ కేసులో కీలకంగా మారిన నయీమ్‌ కుడిభుజం శేషన్నను పట్టుకోవడంలో పోలీసు శాఖ తీవ్ర తాత్సార్యం వహిస్తోందన్న ప్రచారం జరుగుతున్నది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నయీమ్‌ కు సంబంధించి నమోదైన 130 కేసుల్లో 94 మంది నిందితులను సిట్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నయీమ్‌ కుటుంబసభ్యులే గాక గ్యాంగ్‌ సభ్యులు ఉన్నారు. అయితే నయీమ్‌కు కొమ్ముకాసి వేల కోట్ల రూపాయల భూ దందాలు - హత్యలతో నేరసామ్రాజ్యం నిర్మించుకోవడానికి చేయూత నిచ్చిన పలువురు రాజకీయ నాయకులు - ఐపీఎస్‌ అధికారులు - రెవిన్యూ అధికారుల పేర్లు బయటపడటం లేదని నయీమ్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులలో ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ రావు - టీఆర్‌ ఎస్‌ నేత చింత వెంకటేశ్వరరెడ్డిల పేర్లు ఏకంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులలో ఉన్నప్పటికీ తీసుకున్న చర్యలు శూన్యం. 25 ఏళ్లుగా మావోయిస్టులను దెబ్బతీయడానికి నయీమ్‌ ను ఉపయోగించుకుంటూ, అతని ద్వారా కోట్ల రూపాయల లబ్ది పొందిన పలువురు ఐపీఎస్‌ అధికారులు మొదలుకుని ఎస్‌ ఐల వరకు ఇప్పటి వరకు ఎవ్వరిని కూడా సిట్‌ తాకలేదని విమర్శలున్నాయి. మొత్తం మీద నయీమ్‌ తో అంటకాగిన బడాబాబుల పేర్లు బయటపెట్టాలని కోరుతూ కొందరు బాధితులు హైకోర్టుకు వెళ్లడం అదే రోజు సిట్‌ కూడా ఈ కేసులో కొందరు నేతలు - పోలీసు అధికారుల పేర్లను ఉటంకిస్తూ కోర్టుకు నివేదిక ఇచ్చింది.

కోర్టుకు సిట్‌ అందజేసిన నివేదికలో నేతితో పాటు ఒక అదనపు ఎస్పీ మరో ఐదుగురు కింది స్థాయి పోలీసుల పేర్లు మాత్రమే ఉండటం పట్ల పలువురు బాధితులు పెదవి విరుస్తున్నారని తెలిసింది. విషయం కోర్టు వరకు వెళ్లింది కాబట్టి తమపై వస్తున్న విమర్శల నుంచి బయటపెట్టడానికే కొన్ని పేర్లను కోర్టుకు సమర్పించారనే బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నయీమ్‌ తో గట్టి సంబంధాలు కలిగి ఉన్న బడాబాబుల గుట్టును రట్టు చేస్తారా - ఆ దిశగా సిట్‌ అడుగులు సాగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరి ప్రముఖులకు నయీమ్‌ ఉన్న సంబంధాల గురించి సిట్‌ కు కొన్ని ఆధారాలు చిక్కాయని, దానిపై తదుపరి చర్యల విషయంలో వారు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నయీమ్‌ ఎన్‌ కౌంటర్‌ జరిగాక అజ్ఞాతంలోకి వెళ్లిన రెండో గ్యాంగ్‌ స్టర్‌ శేషన్న ఆచూకీని ఇంకా సిట్‌ అధికారులు కనిపెట్టలేక పోయారు. నయీమ్‌ నేరాలన్నింటో భాగస్వామిగా పేర్కొనే శేషన్నతో పాటు మరో 30 మంది సభ్యులు ఉన్నారని అతన్ని పట్టుకునేంత వరకు తాము భయంతోటే బతకాల్సి వస్తుందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సిట్‌ అధికారులు మాత్రం తాము అన్ని ఆధారాలను సేకరించే సంబంధిత నిందితులను అరెస్టు చేస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/