Begin typing your search above and press return to search.

460 కాదు 3 వేలకు పైనే అంట

By:  Tupaki Desk   |   4 July 2016 4:35 AM GMT
460 కాదు 3 వేలకు పైనే అంట
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కొత్త జిల్లాల ప్రయత్నం కొత్త ఉద్యోగాలకు అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది మొదట్లో గ్రూప్ 2 పోస్టులకు నోటిషికేషన్ జారీ చేయటం తెలిసిందే. 460 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఈ ఉద్యోగాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లుగా గుర్తించి నిలిపివేశారు. తాజాగా కొత్తజిల్లాల ఏర్పాటు తెర మీదకు రావటం.. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో గ్రూప్ 2ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయిన వెంటనే.. గ్రూప్ 2 నోటిఫికేషన్ మరొకటి జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త జిల్లాలకు అవసరమైన పోస్టులను గుర్తించి.. అందుకు అనుగుణంగా రిక్రూట్ మెంట్ చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 భర్తీకి దాదాపు 3వేల ఉద్యోగాల వరకూ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన పోస్టులను గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారుల్ని ఆదేశించింది. వారి కసరత్తు పూర్తి అయిన తర్వాత ఎన్నిఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ జారీ చేయాలన్న అంశంపై కేసీఆర్ సర్కారు ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. మొత్తంగా చూస్తే.. రానున్న రోజులు తెలంగాణలో కొత్త కొలువుల జోరు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.