Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారు స్పెషల్

By:  Tupaki Desk   |   11 Sep 2015 5:30 PM GMT
తెలంగాణ సర్కారు స్పెషల్
X
కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని మిగిలిన ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం కాస్త భిన్నమైన ప్రభుత్వం. ఏదైనా ఒక అంశంపై అన్ని ప్రభుత్వాలూ ఒకలా స్పందిస్తే.. కేవలం తెలంగాణ ప్రభుత్వమే కాస్త భిన్నంగా స్పందిస్తుంది. ఈ విషయం రైతు లింబయ్య విషయంలో మరోసారి రుజువైంది.

తెలంగాణవ్యాప్తంగా వర్షాల్లేవు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా కూడా పంటల పరిస్థితి బాగా లేదు. దాదాపు రైతులంతా ఇబ్బందుల్లోనే ఉన్నారు. సాగు ఇబ్బందులకు వ్యక్తిగత సమస్యలు కూడా తోడయినప్పుడు అప్పులు పెరిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లింబయ్య విషయంలో కూడా జరిగిందిదే. సోయా సాగు చేసినా అది పెరిగింది కానీ పంట ఇవ్వలేదు. దానికితోడు కొడుకు అనారోగ్యం. ఈ రెండూ పీడిస్తుంటే ఆయన అనారోగ్యం కూడా తోడయింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి అత్యంత విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలూ అన్నీ కూడా బాధితుని పక్షాన కాస్త సానుభూతి వ్యక్తం చేస్తాయి. మరణం ఎలా సంభవించినా ఎంతో కొంత పరిహారం ప్రకటించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తాయి. తప్ప లింబయ్య ఆర్థిక స్థితి బాగుందని, అప్పులు ఇచ్చే స్థితి కూడా ఉందని అధికారికంగా ఏ ప్రభుత్వమూ ప్రకటించదు. ఒకవేళ అప్పులు ఇచ్చే పరిస్థితి ఉంటే.. చేతినిండా డబ్బులు ఉంటే అనారోగ్యం గురించి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందరు. అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లోనే ఆందోళన చెందుతారు. ఆత్మహత్యపై స్పందించే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం భిన్నంగానే స్పందించింది. ఆత్మహత్యకు వ్యవసాయం కారణం కాదని తేల్చింది. తద్వారా అది ప్రభుత్వ తప్పిదం కాదని తేల్చేసింది. రుణ మాఫీతోనూ లబ్ధి పొందాడని ప్రకటించింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు అన్నిటికంటే తెలంగాణ సర్కారు భిన్నమైనదని మరోసారి రుజువైందని, ఎంతైనా కేసీఆర్ సర్కారు స్పెషల్ అని ఆ పార్టీ నేతలతోపాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.