Begin typing your search above and press return to search.

సీబీఐకి అడ్డ‌గింత‌.. కాళేశ్వ‌రం కోస‌మేనా?!

By:  Tupaki Desk   |   30 Oct 2022 7:19 AM GMT
సీబీఐకి అడ్డ‌గింత‌.. కాళేశ్వ‌రం కోస‌మేనా?!
X
తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం బ‌య‌ట పెట్టిన సీబీఐకి అడ్డ‌గింత జీవోపై ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. సాధార‌ణంగా రాష్ట్ర పోలీసులు విచారించ‌లేని.. లేదా.. వారిస్థాయికి మించిన కేసులు ఎదురైన‌ప్ప‌డు ప్ర‌భుత్వాలు లేదా హైకోర్టు, సుప్రీంకోర్టుల జోక్యం తో సీబీఐ రంగంలోకి దిగు తోంది. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ కూడా హైకోర్టు అనుమ‌తితోనే సీబీఐ చేప‌ట్టింది. ఇది దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా ఉంటుంది. అయితే, తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ అనుమ‌తి లేనిదే ఎవ‌రు ఎలాంటి ఆదేశం ఇచ్చినా చెల్ల‌ద‌న్న‌ట్టుగా , సీబీఐ రావ‌డానికి వీల్లేద‌న్న‌ట్టుగా జీవో ఇచ్చింది.

ఇది ఈ ఏడాది ఆగ‌స్టు 30నే ఇవ్వ‌డం వెనుక ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న కేసు గురించైతే కాద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర స‌ర్కారును డిఫెన్స్‌లో ప‌డేసిన ఎమ్మెల్యేల కొనుగోళ్లు వ్య‌వ‌హారం సీబీఐకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇచ్చిన జీవో కాద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీనిని ఆగ‌స్టులోనే ఇచ్చారు. అంటే.. అప్ప‌ట్లో ఏం జ‌రిగింది? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అప్ప‌ట్లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స‌హా మ‌రో పార్టీ నాయ‌కురాలు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు.

దీనికి సంబంధించి బండి సంజ‌య్ ఏకంగా తీవ్ర ఆరోప‌ణ‌లే చేశారు. క‌ల్వ‌కుటుంబానికి ముడుపులు అందాయ‌ని వేల కోట్లు దోచుకున్నార‌ని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచార‌ణ చేయాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని, దీనిని ఇక్క‌డితో వ‌దిలేద‌ని కూడా ఆరోపించారు.మ‌రో పార్టీ నాయ‌కురాలు కూడా ఇదే ఆరోప‌ణ‌లు చేశారు. అయితే.. అప్ప‌ట్లో దీనిపై కేంద్రం దృష్టికి ఇరు వ‌ర్గాలు తీసుకువెళ్లలేదు. అయినా కూడా ఇప్పుడు వెలువ‌డిన జీవోను బ‌ట్టి చూస్తే ఆ ద‌శ‌లోనే సీబీఐ కి ఎంట్రీ ఇవ్వ‌కుండా లేక‌పోతే, త‌మ అనుమ‌తి తీసుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త ప‌డింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అప్ప‌ట్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి నువ్వా-నేనా అన్న‌ట్టుగా కేసీఆర్‌.. కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ వెళ్లి నిర‌స‌న కూడా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రంలో తానే స్వ‌యంగా ఒక‌రోజు దీక్ష చేశారు. ఇన్ని జ‌రిగిన నేప‌థ్యంలో కాళేశ్వ‌రం విష‌యంపై రాత్రికిరాత్రి సీబీఐ వ‌స్తే ఏం చేయాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఇలా అప్ప‌ట్లో జీవో జారిచేయించి ఉంచార‌ని.. ఏదైనా మిన్ను విరిగి మీద‌ప‌డిన‌ప్పుడు దీనిని బ‌య‌ట‌కు తీసుకురావ‌చ్చ‌ని భావంచి ఉంటార‌ని ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదేమైనా.. కేసీఆర్ చాలా ముందుచూపుతోనే ఈ జీవో ఇచ్చినా, ఇప్పుడు దీనిని బ‌య‌ట‌కు తేవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు పెద్ద‌గా ఒరిగింది లేక పోతే ప్ర‌స్తుత ఎమ్మెల్యే ల కొనుగోలు వ్య‌వ‌హారంలో మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిఏర్ప‌డింది.