Begin typing your search above and press return to search.

ఎస్సీ కులాంత‌ర వివాహంతో పంట పండిన‌ట్లే!

By:  Tupaki Desk   |   24 Sep 2018 7:12 AM GMT
ఎస్సీ కులాంత‌ర వివాహంతో పంట పండిన‌ట్లే!
X
మిర్యాల‌గూడ‌లో చోటు చేసుకున్న ప్ర‌ణ‌య్ హ‌త్య వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచ‌ల‌నంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ప‌ది రోజులుగా మీడియాలో - సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా అదే చ‌ర్చ‌. ప్ర‌ణ‌య్ ఎస్సీ కాక‌పోయి ఉంటే.. అమృత‌రావు పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడు కాద‌ని.. అత‌ణ్ని అల్లుడిగా స్వీక‌రించేవాడ‌ని షెడ్యూల్డు కులాల వారి వాద‌న‌. ఏది ఎలా ఉన్నా.. స‌మాజంలో కుల వివ‌క్ష‌ను రూపుమాపే దిశ‌గా మ‌రో అడుగు ముందు కేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎస్సీ కులాంత‌ర వివాహం జ‌రిగితే.. ఆ దంప‌తుల‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు ప్రోత్సాహ‌కంగా అందిస్తోంది. మ‌రో రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు కేంద్ర‌ప్ర‌భుత్వం నుంచి అందుతున్నాయి. అయితే, ఇప్ప‌టికీ కుల వివ‌క్ష త‌ర‌గ‌డం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. కులాంత‌ర వివాహ ప్రోత్సాహ‌కాల కోసం ద‌ర‌ఖాస్తులు ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని.. ఎస్సీల విష‌యంలో ఈ సంఖ్య మ‌రీ త‌క్కువ‌గా ఉంటోంద‌ని గ‌ణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి రంగంలోకి దిగుతోంది. ఎస్సీ కులాంత‌ర వివాహాల‌కు ప్రోత్సాహ‌కాన్ని ఏకంగా రూ.2.5 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని యోచిస్తోంది. ఈ మేర‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ‌శాఖ డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర్ ప్ర‌భుత్వానికి ఇటీవ‌లే ప్ర‌తిపాద‌న‌లు కూడా పంపించారు. ఆయ‌న ప్ర‌తిపాద‌నలను ఆమోదిస్తూ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశ‌ముంది. అంటే.. ఇక‌పై తెలంగాణ‌లో ఎస్సీ కులాంత‌ర వివాహం జ‌రిగితే.. రాష్ట్రం త‌ర‌ఫున రూ.2.5 ల‌క్ష‌లు - కేంద్రం త‌ర‌ఫున మ‌రో 2.5 ల‌క్ష‌లు మొత్తంగా రూ.5 ల‌క్ష‌లు అందుతాయ‌న్న‌మాట‌. డ‌బ్బు సంగ‌తెలా ఉన్నా.. ప్ర‌భుత్వాల నుంచి వ‌చ్చే ఈ ప్రోత్సాహ‌కాల‌తోనైనా సమాజంలో కుల‌వివ‌క్ష తొల‌గిపోవాల‌ని.. ప్ర‌ణ‌య్ వంటి ప్రేమికుల హ‌త్య‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డాల‌ని ఆశిద్దాం.