Begin typing your search above and press return to search.

తెలంగాణలో యాక్సిడెంట్ చేస్తే ఇక రెడ్ మార్కే

By:  Tupaki Desk   |   27 Jan 2016 4:27 AM GMT
తెలంగాణలో యాక్సిడెంట్ చేస్తే ఇక రెడ్ మార్కే
X
ఒకరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగల్చటమే కాదు.. అంతులేని శోకానికి కారణమవుతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం.. బాధ్యతారాహిత్యంతో డ్రైవింగ్ చేయటం ఈ మధ్య కాలంగా ఎక్కువైంది. ఇలాంటి పోకడలకు చెక్ చెప్పేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక వినూత్న విధానాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చర్చల్లో ఉండి.. కొత్త విధానానికి తుది మెరుగులు దిద్దుతున్న ఈ విధానం కానీ అమల్లోకి వస్తే.. ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే అవకాశం ఉండదు.

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సర్కారు అమలు చేయాలని భావిస్తున్న ఈ సరికొత్త విధానం చూస్తే..

వాహనదారులు యాక్సిడెంట్లు చేస్తే.. అందుకు కారణమైన వారికి పడే శిక్షలు ఇప్పుడు చాలా తక్కువ. ఇకపై.. అలాంటి తప్పులు చేసే వారికి భారీ జరిమానాలు.. శిక్షలు వేయటమే తాజా విధానంగా చెప్పొచ్చు. పలు ప్రాశ్చాత్య దేశాల్లో అమలు చేస్తున్న విధానాన్ని మనకు తగ్గట్లుగా మార్పులు చేసి.. అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసారి యాక్సిడెంట్ కు పాల్పడితే.. రూ.10వేల జరిమానా విధించాలని భావిస్తున్నారు. దీనికి తోడు బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన నష్ట పరిహారం భారీగా పెంచాలని నిర్ణయించారు.

అన్నింటికి మించి కఠిన శిక్షలేమిటంటే.. యాక్సిడెంట్ చేసే వారికి జైలు శిక్షలు విధించటంతో పాటు.. వారి డ్రైవింగ్ లైసెన్స్ మీద రెడ్ మార్క్ చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి రెడ్ మార్క్ లు మూడు కానీ పడితే.. శాశ్వితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు. ప్రస్తుతం కసరత్తు స్టేజ్ లో ఉన్న ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే.. డ్రైవింగ్ చేసే వారు మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లే.