Begin typing your search above and press return to search.

గుట్టు చప్పుడు కాకుండా భారీగా బాదేశారుగా కేసీఆర్?

By:  Tupaki Desk   |   5 Sep 2021 3:46 AM GMT
గుట్టు చప్పుడు కాకుండా భారీగా బాదేశారుగా కేసీఆర్?
X
ఈ మధ్యనే భూములు.. ఇళ్లు.. ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. స్టాంపు డ్యూటీని భారీగా పెంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా మరో బాదుడుకు తెర తీసింది. గుట్టు చప్పుడు కాకుండా.. పెద్ద హడావుడి లేకుండా అంతర్గత ఉత్తర్వుల్ని జారీ చేయటం ద్వారా ఈ నెల (సెప్టెంబరు) 2 నుంచి భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన వివిధ సేవల ఛార్జీల పెంపు విషయం ఎవరికి వారు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే తప్పించి పెద్దగా అర్థం కానట్లుగా చేశారు.

చిన్న చిన్న అంశాలకు గతంలో రూ.వంద, రూ.2వందలు అన్నట్లు ఉండే చార్జీల్నితాజాగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పెంచేశారు. సింఫుల్ గా ఒకట్రెండు పెంచిన ఛార్జీల గురించి ప్రస్తావిస్తే.. బాదుడు రేంజ్ ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. వ్యవసాయేతర భూములు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి నెలా కనీసం లక్ష వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.500లకు పెంచేశారు. అంటే.. ఒక్క డాక్యుమెంట్ ఛార్జీల కిందే ఏడాదికి కనీసం రూ.50 కోట్ల ఆదాయం రానుంది.

ఈ లెక్కన ఇప్పుడు పెంచిన ఛార్జీల మోతను అంచనా వేస్తే.. తక్కువలో తక్కువ రూ.500 కోట్ల మేర ఆదాయం వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం ఉండటం గమనార్హం. ఇంతకాలం చిట్ ఫండ్ చట్టం 1982 ప్రకారం.. రూ.5లక్షల వరకు ఉన్న చిట్టీలను రిజిస్టర్ చేసేందుకు రూ.3500.. రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువైన చిట్టీల రిజిస్ట్రేషన్ల కోసం రూ.5వేలు.. ఆర్బిట్రేషన్ ఫీజు కింద రూ.2వేలు వసూలు చేయనున్నారు. ఇలా అది ఇది అన్న తేడా లేకుండా ప్రతిదానికి భారీగా బాదేసిన వైనం ఇప్పుడుఆసక్తికరంగా మారింది.

డాక్యుమెంట్‌ రకం గతంలో చార్జీ పెంచిన చార్జీ
ర్యాటిఫికేషన్‌ రూ.వెయ్యి రూ.2వేలు
మార్టిగేజ్‌ రూ.2వేలు రూ.2వేలు
ఎస్‌పీఏ రూ.వెయ్యి రూ.3వేలు
జీపీఏ రూ.వెయ్యి రూ.5వేలు
ప్రైవేట్‌ అటెండెన్స్‌ రూ.వెయ్యి రూ.10వేలు
వీలునామా రూ.వెయ్యి రూ.3వేలు
వీలునామా విచారణ రూ.వెయ్యి రూ.5వేలు
రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ రూ.వంద రూ.500
15 పేజీలు దాటితే రూ.5(పేజీకి) రూ.వెయ్యి
మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ రూ.10 రూ.100
సర్టిఫైడ్‌కాపీ రూ.200 రూ.500
ఈసీ రూ.100 రూ.500
30 ఏళ్లు దాటిన ఈసీ రూ.500 రూ.వెయ్యి
(ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనని ప్రతి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఫీజును రూ.3వేలుగా ఖరారు చేశారు)

పెరిగిన చార్జీలు.. ఫీజులు ఇలా..

- గతంలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కోసం స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు డాక్యుమెంట్‌ చార్జీ కింద రూ.100 తీసుకుంటే ఇప్పుడు రూ.500కు పెంచారు. ఈ డాక్యుమెంట్లో 15 పేజీలకు మించి ఉంటే.. ప్రతి అదనపు పేజీకి రూ.5 చొప్పున చార్జి చేసేవారు. కానీ ఇప్పుడు పేజీల సంఖ్యతో సంబంధం లేకుండా 15 పేజీలు మించిన డాక్యుమెంట్‌కు చార్జీ రూ.వెయ్యి చేసేశారు.

- స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (ఎస్‌పీఏ) ఎవరికైనా ఇవ్వాలంటే గతంలో రూ.1,000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు చేశారు. అదే జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చార్జీని రూ.1,000 నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచేశారు.
- రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చే వీలులేని వ్యక్తుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే.. ప్రైవేట్‌ అటెండెన్స్‌ కింద గతంలో రూ.1,000 అదనపు చార్జీ తీసుకునేవారు. ఇప్పుడీ ఫీజును ఏకంగా రూ.10 వేలకు పెంచారు. సెలవు రోజున రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వస్తే.. ఇందుకు రూ. 5 వేలు ఫీజుగా ఖరారు చేశారు.

- ఏదైనా ఆస్తి, భూమికి సంబంధించి సర్టిఫైడ్‌ కాపీ తీసుకోవాలంటే రూ.200 చార్జీ ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)కు గతంలో రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.500 చేశారు. 30 ఏళ్లు దాటిన ఈసీ కావాలంటే.. గతంలో రూ.500 చార్జీ ఉండేది. తాజాగా దాన్ని వెయ్యి రూపాయిలకు పెంచారు.