Begin typing your search above and press return to search.

సీఎం స‌హాయ‌నిధిలో గోల్‌ మాల్‌?

By:  Tupaki Desk   |   31 Oct 2018 3:10 PM IST
సీఎం స‌హాయ‌నిధిలో గోల్‌ మాల్‌?
X
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ విడుద‌ల‌లో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫండ్‌ ను ఎవ‌రెవ‌రికి విడుద‌ల చేశార‌నే లెక్క‌లు కూడా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర లేవ‌ని తెలుస్తోంది. ఒకే రిజిస్ట‌ర్ నెంబ‌ర్ల‌పై ప‌లువురు త‌మ పేర్లు మార్చుకొని సీఎం స‌హాయ నిధిని బొక్కేశార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ కుంభ‌కోణం వెనుక ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్త‌మూ ఉండొచ్చ‌ని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

2014 జూన్ నుంచి 2015 ఆగ‌స్టు మ‌ధ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవ‌రెవ‌రికి సాయం అందిందో తెలియ‌జేయాలంటూ విజ‌య్ గోపాల్ అనే ఉద్య‌మకారుడు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేశారు. స‌ద‌రు నిర్దిష్ట కాలంలో తెలంగాణ రెవెన్యూ శాఖ సీఎం స‌హాయ నిధి కింద మొత్తం 12,462 చెక్కుల‌ను క్లీయ‌ర్ చేసింద‌ని.. వాటి విలువ రూ.84.94 కోట్ల‌ని ఆయ‌న‌కు స‌మాధానం అందింది.

ఇక్క‌డ విచిత్ర‌మేమిటంటే ఎన్ని చెక్కుల‌ను క్లీయ‌ర్ చేశామ‌నే లెక్క‌లు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉన్న‌ప్ప‌టికీ.. వాటి ల‌బ్దిదారుల వివ‌రాలు మాత్రం పూర్తిగా అందుబాటులో లేవు. కేవ‌లం 182 చెక్కుల ల‌బ్ధిదారుల వివ‌రాలే ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయి. మిగ‌తా ల‌బ్ధిదారులెవ‌రు? ఏ కార‌ణాల‌తో వారికి స‌హాయ నిధి అంద‌జేశారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే క‌ర‌వైంది.

అందుబాటులో ఉన్న కొన్ని వివ‌రాలు ప‌రిశీలిస్తే.. అందులోనూ విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఓ వ్య‌క్తి గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌లో నీటిలో మునిగి చ‌నిపోగా.. అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు రూ.ల‌క్ష స‌హాయం సీఎం రిలీఫ్ ఫండ్ అందింది. ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వారికి స‌హాయాన్ని సిఫార్సు చేశారు. రాష్ట్రంలో ఇంత‌మంది క‌ష్టాల్లో ఉండ‌గా.. రైత‌న్న‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతుండ‌గా ఎక్క‌డో అమెరికాలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో మృతిచెందిన‌వారికి స‌హాయం చేస్తూ నిధుల దుర్వినియోగం చేయ‌డ‌మేంట‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక మ‌రికొన్ని చెక్కులు నేరుగా ఆస్ప‌త్రుల బ్యాంకు ఖాతాల పేరిట విడుద‌లయ్యాయి. ఎవ‌రికి చికిత్స అందించేందుకు వాటిని జారీ చేశార‌నే సంగ‌తి వాటిపై లేనే లేదు. సీఎం రిలీఫ్ ఫండ్‌ లో భారీ కుంభ‌కోణం చోటుచేసుకుంద‌ని చెప్పేందుకు ఇవే సాక్ష్యాల‌ని విజ‌య్ చెబుతున్నారు. వాస్త‌వానికి సీఎం స‌హాయ‌నిధిని అందుకోవాలంటే ద‌ర‌ఖాస్తుదారులు త‌మ రేష‌న్‌ కార్డు వివ‌రాలు - ఫోన్ నెంబ‌రు - బ్యాంకు ఖాతా వంటివి స‌మ‌ర్పించాల‌ని.. ఈ నిబంధ‌న‌ల‌న్నింటినీ తుంగ‌లోకి తొక్కి ప్ర‌భుత్వం ఇష్టారీతిన నిధులు మంజూరు చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితుల‌కు స‌హాయం చేస్తామంటూ కేటీఆర్ ట్విట‌ర్‌ లో చెప్పేదంతా నాట‌క‌మ‌ని విజ‌య్ ఆరోపించారు. ఏదైనా ఘ‌ట‌న‌ను వివ‌రిస్తూ కేటీఆర్‌ ను నెటిజ‌న్లు ట్యాగ్ చేయ‌గానే ఆయ‌న స్పందిస్తున్న సంగ‌తిని గుర్తుచేశారు. త‌న ఆదేశాల మేర‌కు సిబ్బంది బాధితుల‌ను క‌లుస్తార‌ని.. వారికి సాయం చేస్తార‌ని బాధ్య‌త‌గ‌ల వ్య‌క్తిగా న‌టిస్తూ కేటీఆర్ చెబుతున్నార‌ని పేర్కొన్నారు. ఆ వ్య‌వ‌హారం ట్వీటుతో ముగిసిపోతుందే త‌ప్ప‌.. ఆయ‌న వాస్త‌వానికి సాయం అందించ‌ర‌ని ఆరోపించారు.