Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆగిన మరో గుండె.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   3 March 2023 8:32 PM GMT
తెలంగాణలో ఆగిన మరో గుండె.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం
X
యువత సడెన్ హార్ట్ ఎటాక్ లకు బలి అవుతున్నారు. గత కొన్ని నెలలుగా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన అనేక షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నిపుణులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువ జనాభాలోనూ గుండెపోటులు, కార్డియాక్ అరెస్ట్‌లు.. స్ట్రోక్‌ల వల్ల ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి కొవ్వు పదార్థాలు తినడంతోపాటు అసహజ శరీర కసరత్తులు, ఎక్సర్ సైజులు, డీహైడ్రేషన్ వంటివి కారణం అని చెబుతున్నారు..

నవ యువకులు 30 ఏళ్లలో పు వారు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. పునీత్, తారకరత్న నుంచి నిన్నటి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, కానిస్టేబుల్ వరకూ అందరూ జిమ్ చేస్తూ, కసరత్తులు చేస్తూ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన వారే. వారంతా ఫిట్ గానే ఉంటున్నారు. మరి ఎందుకు చనిపోతున్నారన్నది అంతుబట్టడం లేదు.ఇది మరిచిపోకముందే తాజాగా మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్ నడుస్తూ ఛాతిలో నొప్పితో సడన్ గా కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అతడిని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

తెలంగాణలో యువతలో ఇలాంటి హార్ట్ ఎటాక్ మరణాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటివరకు ఎంతో చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి.

తెలంగాణలో ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హార్ట్ ఎటాక్ బారిన పడిన వారిని రక్షించేందుకు ఉపయోగించే ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డీఫిబ్రిలేటర్ పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిని పబ్లిక్ ప్లేసులో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 1400 పరికరాలను ఆర్డర్ ఇచ్చినట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

హార్ట్ ఎటాక్ బారిన పడిన వారికి ఆటోమెటిక్ ఎక్స్ టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) ఎంతగానో ఉపయోగపడుతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్లోనూ ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఉండే బస్టాండ్లు, విమానాశ్రయాలు, మాల్స్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. వీటిద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు గుండెపోటుకు గురయ్యే వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.