Begin typing your search above and press return to search.

మోడీ మీద కేసీఆర్ సర్కారు రగిలిపోతుందా?

By:  Tupaki Desk   |   17 July 2015 4:29 AM GMT
మోడీ మీద కేసీఆర్ సర్కారు రగిలిపోతుందా?
X
రాజకీయాల్లో ఒక పరిణామం అంత త్వరగా చోటు చేసుకోదు. అలాంటివి ఏర్పడటానికి వెనుక బ్యాక్ గ్రౌండ్ చాలానే కథ నడుస్తుంది. తాజాగా.. కేంద్రంపై తెలంగాణ సర్కారు అసంతృప్తి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ప్రధాని మోడీ చాలా చురుగ్గా ఉన్నారని.. అలాంటి వ్యక్తి నేతృత్వంలో దూసుకెళ్లొచ్చన్న పొగడ్తలు పొగిడేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు అదే నోటితో విమర్శలు చేస్తోంది.

ఉన్నట్లుండి తెలంగాణ సర్కారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది ఎందుకు? తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదన్న వ్యాఖ్య ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే చాలానే కారణాలు కనిపిస్తాయి. ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశాల నేపథ్యంలోనే.. తెలంగాణ అధికారపక్షం నోటి వెంట కేంద్రం తీరుపై గుర్రుగా ఉందని చెప్పొచ్చు.

రాష్ట్ర విభజనకు సంబంధించి హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సర్కారు మరోసారి నిరసన గళాన్ని అందుకుంది. అయితే.. ఇదంతా హైకోర్టు విభజన అంశంతోనే ముడిపడి లేదని.. అంతర్గతంగా మరొకొన్ని అంశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణ బెవరేజస్ కు సంబంధించిన వివాదం విషయంలో ఐటీ శాఖ.. తెలంగాణ ఖజానా నుంచి రూ.1274కోట్లను ఒక్క మాటతో తరలించి వేయటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంత భారీ మొత్తం ఒక్కసారిగా ఖజానా నుంచి తరలిపోవటంతో.. ఆర్థికంగా తెలంగాణ సర్కారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయంపై ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలన్నీ తెలంగాణ సర్కారు చేసినా.. తరలి వెళ్లిన పైసల్లో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాని పరిస్థితి. కేంద్ర ఆర్థిక మంత్రి రెండు రోజుల్లో తీసుకున్న మొత్తాన్ని తెలంగాణ సర్కారు ఖాతాలో వేస్తామని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోవటంపై తెలంగాణ సర్కారు ఉడికిపోతోంది.

దీనికి తోడు.. పలు అంశాలకు సంబంధించి కేంద్రం నిర్ణయాలు తీసుకోకపోవటం తెలంగాణ సర్కారు బాధిస్తోంది. అందుకే.. త్వరలో మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. తన అసంతృప్తి గళాన్ని వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే విప్పటం మొదలు పెట్టిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ పొగిడిన నోటితోనే ఇప్పుడు విమర్శలు చేస్తున్న పరిస్థితి.