Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారు లెక్క బోల్తా!

By:  Tupaki Desk   |   22 Feb 2016 11:30 AM GMT
తెలంగాణ సర్కారు లెక్క బోల్తా!
X
వేసుకునే అంచనాలకు వాస్తవాలకు మధ్య అంతరం ఎంతగా ఉంటుందన్న విషయం తాజాగా తెలంగాణ బడ్జెట్ లెక్కలు చూస్తే తెలుస్తుందన్న మాట వినిపిస్తోంది. విభజన తర్వాత ఇద్దరు చంద్రుళ్లు. . పోటాపోటీగా లక్ష కోట్ల మార్క్ కు తగ్గకుండా బడ్జెట్ లను రూపొందించటం.. ఏడాదికేడాదికి బడ్జెట్ అంచనాల్ని పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.

అయితే.. అంకెలకు.. వాస్తవాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతున్న విషయం తాజా బడ్జెట్ లెక్కల్ని చూస్తున్నపుడు తేలిందని చెబుతున్నారు. అదెలానంటే.. గత బడ్జెట్ లో తెలంగాణలో భూములు అమ్మటం ద్వారా రూ.13,500కోట్ల అంచనాల్ని సర్కారు సిద్ధం చేసింది. బడ్జెట్ లోనూ అదే చెప్పుకున్నారు. కానీ.. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగిసే నాటికి భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం మాట వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి.

ఎందుకంటే.. భూముల అమ్మకం ద్వారా గడిచిన 11 నెలల్లో తెలంగాణ సర్కారుకు వచ్చిన ఆదాయం కేవలం రూ.392 కోట్లే. అంచనాలు ఘనంగా.. వాస్తవం ఇంత దారుణంగా ఉంటే బడ్జెట్ లెక్కలన్నీ అంకెల గారడీగా మారటం ఖాయం. పెట్టుకున్న అంచనాలకు.. వచ్చిన ఆదాయానికి మద్యనున్న అంతరాన్ని కాస్త అయినా తగ్గించేందుకు వీలుగా.. నెల వ్యవధిలో మరో విడత భూముల విక్రయం పెట్టి రూ.2వేల కోట్లు అయిన ఖజానాకు జమ చేయాలని టీ సర్కారు భావిస్తోంది. ఒకవేళ అలా చేసినా రూ.13,500 కోట్లలో జమ అయిన మొత్తం ఏపాటిది?​