Begin typing your search above and press return to search.

అమృత‌కు అండ‌గా టీస‌ర్కార్!

By:  Tupaki Desk   |   20 Sep 2018 12:50 PM GMT
అమృత‌కు అండ‌గా టీస‌ర్కార్!
X
మిర్యాల‌గూడ‌లో ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. త‌న క‌ళ్ల ఎదుటే భ‌ర్త ప్ర‌ణ‌య్ ను అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేయ‌డంతో అమృత షాక్ కు గురై కంట‌తడి పెట్టిన‌ వైనం ప్ర‌జ‌లంద‌రినీ క‌ల‌చివేసింది. గ‌ర్భిణి అయిన అమృత‌...పెళ్లైన కొద్ది నెల‌ల‌కే ఒంట‌రిగా మిగ‌ల‌డంపై స‌ర్వ‌త్రా సానుభూతి వ్య‌క్త‌మైంది. అమృత‌కు మ‌ద్ద‌తుగా ప‌లు ప్ర‌జా సంఘాలు, నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అమృత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం సాయం అందించింది. అమృత‌కు సాగుకు అనువైన వ్య‌వ‌సాయ భూమితో పాటు - డ‌బుల్ బెడ్ రూం ఇంటిని ప్ర‌భుత్వం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. దాంతోపాటు - అమృత‌కు 8 లక్షల 25 వేలు సాయం అందిస్తామని ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.

ప్ర‌ణ‌య్ మ‌ర‌ణం త‌ర్వాత అమృత భద్రతపై కూడా అనుమానాలు వ్య‌క్తం అయిన సంగతి తెలిసిందే. దీంతో, అమృత‌కు భ‌ద్ర‌త‌గా పోలీసులు అందుబాటులో ఉంటారని జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. ఆమెకు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని అన్నారు. అమృత‌ను అన్నివిధాలుగా ఆదుకుంటామ‌ని తెలిపారు. మ‌రోవైపు, ప్రణయ్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీరెడ్డి పరామర్శించారు. ప్రణయ్‌ కుటుంబానికి, అమృతకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌ణ‌య్ హ‌త్యోదంతం అనంతరం కులాంత‌ర‌ ప్రేమవివాహం చేసుకున్న జంటలపై దాడుల ఘ‌ట‌న‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. హైద‌రాబాద్ లోని ఎర్ర‌గ‌డ్డ‌లో సందీప్ - మాధవిలపై ఆమె తండ్రి హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న భార్య శ్రీ‌హ‌ర్ష‌ను ఆమె త‌ల్లిదండ్రులు బ‌ల‌వంతంగా తీసుకువెళ్లార‌ని....శ్రీ‌కాంత్ అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.