Begin typing your search above and press return to search.

బ‌డా బిల్డ‌ర్ల‌కు భారీ మేలు చేసే జీవో రిలీజ్

By:  Tupaki Desk   |   24 April 2019 5:30 AM GMT
బ‌డా బిల్డ‌ర్ల‌కు భారీ మేలు చేసే జీవో రిలీజ్
X
వ‌డ్డించేటోడు మ‌నోడైతే వ‌రుస‌లో ఎక్క‌డ కూర్చున్నా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ప్ర‌భుత్వం గుడ్ లుక్స్ లో ఉండాలే కానీ.. ఏదోలా సాయం పొందే అవ‌కాశం పుష్క‌లంగా ఉంటుంది. తాజాగా అలాంటి ప‌నే చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో నిర్మించే భారీ భ‌వ‌నాల‌కు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ జారీ చేసిన బిల్డింగ్ కోడ్ 2016కు కొన్ని మార్పులు చేస్తూ తాజాగా జీవోను విడుద‌ల చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం.. తాజాగా చేసిన మార్పులు బ‌డా బిల్డ‌ర్ల‌కు స్వీట్ న్యూస్ గా అభివ‌ర్ణిస్తున్నారు. కొత్త నిబంధ‌న‌లు రియ‌ల్ బూమ్ కు మ‌రింత మేలు చేస్తాయ‌ని చెబుతున్నారు. బిల్డ‌ర్ల మార్జిన్లు మ‌రింత మెరుగుప‌డేలా ఉండటం ఖాయ‌మంటున్నారు. భ‌వ‌న నిర్మాణ విష‌యంలో రూల్స్ ను నూటికి తొంభై శాతం మంది పాటించ‌ని ప‌రిస్థితి. దీని పుణ్య‌మా అని.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి.

చిన్న చిన్న నిర్మాణాల విష‌యంలో ఇలా ఉంటే.. భారీ నిర్మాణాల విష‌యంలో ప్ర‌భుత్వ‌మే ప‌రిమితుల్ని స‌డ‌లించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా మారిన విధానాలు బిల్డ‌ర్ల‌కు మేలు జ‌రిగేలా.. వ‌స‌తులు త‌గ్గేలా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా ఒక అంశాన్ని చెప్పుకోవ‌చ్చు.

70 మీట‌ర్లు అంత‌కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే హైరైజ్ బిల్డింగ్ ల నిర్మాణంలో వ‌ద‌లాల్సిన సెట్ బ్యాక్ ఇప్పుడు త‌గ్గ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రూల్స్ ప్ర‌కారం 120 మీట‌ర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భ‌వ‌నాల చుట్టూ క‌చ్ఛితంగా 22.5 మీట‌ర్ల స్థ‌లాన్ని వ‌ద‌లాల్సి వ‌చ్చేది. కానీ.. మారిన రూల్ ప్ర‌కారం ఇది 20 మీట‌ర్ల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

అంతేకాదు.. ఇక‌పై టెర్ర‌స్ మీద స్విమ్మింగ్ పూల్స్ ను అనుమ‌తిస్తారు. మార్చిన నిబంధ‌న‌లు బిల్డ‌ర్ల‌కు మేలు చేసేలా ఉన్నాయ‌ని.. ఈ రూల్స్ ప్ర‌కారం కాస్తంత వెలుగు త‌గ్గ‌టం ఖాయ‌మంటున్నారు. రోజులు గ‌డిచే కొద్దీ సెట్ బ్యాక్స్ విష‌యంలో ప‌రిమితులు మ‌రింత ప‌రిమితంగా ఉండాలే కానీ.. బిల్డ‌ర్ల‌కు లాభించేలా మార్పులు చేయ‌టం దేనికి నిద‌ర్శ‌నం? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. తాజా మార్పులు వినియోగ‌దారుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాన్ని క‌ల్పించ‌వ‌ని.. త‌గ్గిన సెట్ బ్యాక్ ల‌కు త‌గ్గ‌ట్లు ధ‌ర త‌గ్గ‌ద‌ని.. ఇది నిర్మాణ‌రంగం వారికి.. అందునా బ‌డా బిల్డ‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌టం మిన‌హా మ‌రెవ‌రికీ లాభం చేకూర్చ‌ద‌ని చెబుతున్నారు. రాజు త‌లుచుకుంటే వ‌రాల‌కు కొద‌వా ఏంటి?