Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆ కేసులపై గవర్నర్ ఆందోళన

By:  Tupaki Desk   |   8 Jun 2020 4:30 PM GMT
తెలంగాణలో ఆ కేసులపై గవర్నర్ ఆందోళన
X
అన్‌లాక్ 1.0 కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్న తరుణంలో.. గత 24 గంటల్లో 14 మంది కరోనా వైరస్ తో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలలో ఒకే రోజులో తెలంగాణలో ఇదే అత్యధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తెలంగాణలో జూన్ 8 నుంచి కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. మాల్స్, షాపింగ్ , దేవాలయాలు, రెస్టారెంట్లు, హోటల్స్ ను తెరుస్తున్నారు. ఈ క్రమంలో మరింతగా వైరస్ వ్యాపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం మహమ్మారి మరణాల సంఖ్య 137 కు చేరుకుంది. రాష్ట్రం నుండి ఒక రోజులో అత్యధిక మరణాలు ఈరోజే సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కొత్త గరిష్టాన్ని తాకింది. ఆదివారం 154 పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,650 కు చేరుకుంది.

లక్షణాలు లేని రోగులు, కరోనా వైరస్ ను ఇతరులకు వ్యాపింపచేయడం వల్లే తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కఠినమైన నియంత్రణ చర్యలను అమలు చేసిన తరువాత కూడా తెలగాణలో ఇన్ని కేసులు పెరుగుదల ప్రధాన ఆందోళనగా మారింది. తెలంగాణలో కేసుల తీవ్రత పెరుగుతుండడం బాదేస్తోందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ పేర్కొన్నారు.

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించిన తెలంగాణ గవర్నర్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు, కార్డియాలజీ తోపాటు జనరల్ మెడిసిన్ కు చెందిన నలుగురు ప్రొఫెసర్లు మరియు ఎనిమిది మంది రెసిడెంట్ వైద్యులు, ఎనిమిది మంది పారామెడిక్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని.. మొత్తం నిమ్స్ లో 20 మంది ఈ వైరస్ సోకిందని నిమ్స్ డైరెక్టర్ గవర్నర్ తమిళిసైకి తెలిపారు.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వైరస్ అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వ చర్యలు సరిపోతాయా అని ఆమె అడిగితెలుసుకున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి కొత్త వ్యూహాలను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనావైరస్ సంక్రమణ తీవ్రత బాగా పెరిగిందని.. ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియడం లేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరింతగా అందరికీ పరీక్షలు చేయాలని గవర్నర్ కోరారు.