Begin typing your search above and press return to search.

మీకు.. కేసీఆర్ కు విభేదాలు ఉన్నాయా?అని గవర్నర్ ను అడిగితే?

By:  Tupaki Desk   |   7 Feb 2021 5:10 AM GMT
మీకు.. కేసీఆర్ కు విభేదాలు ఉన్నాయా?అని గవర్నర్ ను అడిగితే?
X
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సై ఎంపిక ఒక సంచలనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రం ఆమెను సీన్లోకి తీసుకొచ్చారని చెబుతారు. పక్కా పొలిటికల్ నేతగా సుపరిచితురాలు.. తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలిగా వ్యవహరించే ఆమెను.. చాలా చిన్న వయసులోనే (గవర్నర్ గా ఎంపిక చేసే వయసును సగటుగా చేసి చూసినప్పుడు) గవర్నర్ బాధ్యతల్ని అప్పగించటం సంచలమైంది. పలువురు గవర్నర్ల మాదిరి వివాదాస్పదం కాకుండా.. అదే సమయంలో అందరికి అందుబాటులో ఉండటమే కాదు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న గవర్నర్ తమిళసై.. తొలిసారి ఇంటర్వ్యూను ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత ఏమంటే.. సో.. సోగా కాకుండా.. కాస్త సూటిగా ప్రశ్నలు సంధించటం.. దానికి అంతే తెలివిగా బదులిచ్చిన గవర్నర్ తమిళ సై మాటలు ఆసక్తికరంగా మారాయి. సదరు ఇంటర్వ్యూలో సంధించిన ప్రశ్నల్లో ఒకటి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో విభేదాలు ఏమైనా ఉన్నాయా? అని. దానికి ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. ఆమె ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చెబితే.. ‘‘మేమిద్దరం ఎవరి పదవిలో వాళ్లు ఉన్నాం. మా మధ్య ఒక గవర్నర్.. ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సిన సంబంధాలే ఉన్నాయి. నేను ముఖ్యమంత్రితో పోట్లాడటం లేదు. మా మధ్య అంశాల వారీగా విభేదాలు ఉండవచ్చు. నేను ప్రభుత్వానికి విధేయురాలిని కాదు. అలాగని విరోధినీ కాదు. నేను ప్రజల కోసం పని చేస్తానంతే. నా ద్రష్టికి వచ్చిన అంశాల్ని సీఎస్.. ముఖ్యమంత్రి ద్రుష్టికి తప్పనిసరిగా తీసుకెళతా’ అని పేర్కొన్నారు.

మరో ఆసక్తికరమైన ప్రశ్నను ఈ ఇంటర్వ్యూలో సంధించారు. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మిమ్మల్ని తెలంగాణ గవర్నర్ గా నియమించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి కదా? అని ప్రశ్నించగా.. దానికి ఆమె బదులిస్తూ.. ‘‘గవర్నర్ రాజకీయాలు చేయకూడదు. కానీ.. రాజకీయ నాయకులు గవర్నర్ కావొచ్చు. నేను ప్రభుత్వ విరోధిని కాదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లే బాధ్యత నాపైన ఉంది. వాటిని అమలు చేసేలా చూసే సామర్థ్యం ఉంది. నేను రబ్బర్ స్టాంప్ ను కాదు’’ అని తానేమిటి? తానెలా పని చేస్తానన్న విషయాన్ని ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలతోనే చెప్పేశారని చెప్పాలి.