Begin typing your search above and press return to search.

బ‌దిలీల‌తో అబ్బా అనిపించేలా కేసీఆర్ దెబ్బ‌

By:  Tupaki Desk   |   3 Jan 2018 7:13 AM GMT
బ‌దిలీల‌తో అబ్బా అనిపించేలా కేసీఆర్ దెబ్బ‌
X
రాష్ట్రంలో ఐఏఎస్‌లు.. ఐపీఎస్ ల బ‌దిలీలు మామూలే. పాల‌నా సౌల‌భ్యం కోసం ఇలాంటివి చేస్తుంటారు. అయితే.. ప్ర‌తి చ‌ర్య వెనుక లెక్క‌లు చాలానే ఉంటాయి. అందులోకి కీల‌క‌మైన ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం చేయ‌టం అంటే మాట‌లు కాదు. ఎక్క‌డ.. ఏం తేడా జ‌రిగినా తోలు తీస్తాన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే సీఎం కేసీఆర్‌..తాజాగా తాను చేసిన ఐఏఎస్ బ‌దిలీల ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపారు? అని చూస్తే.. ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌క మాన‌దు.

తానేం చేసినా.. లెక్క‌గా చేస్తాన‌న్న విష‌యాన్ని తాజా బ‌దిలీల్లో మ‌రోసారి నిరూపించుకున్నారు కేసీఆర్‌. అధికార‌ప‌క్ష నేత‌లు వేసే వేషాల‌కు చెక్ పెట్టిన ప్ర‌తి అధికారికి బ‌దిలీ దెబ్బ ప‌డ‌ట‌మే కాదు.. అప్రాధాన్య‌త పోస్టుల్లోకి స్థాన‌చ‌ల‌నం చేయ‌టం క‌నిపిస్తుంది. వృత్తినే ప్రాణంగా ప‌ని చేసే వారికి ఉద్య‌మ స్ఫూర్తిగా ఏర్ప‌డిన రాష్ట్రంలో ఏదో చేయాల‌ని త‌పించిన వారికి భారీ షాకులు త‌ప్ప‌లేదు. తేడా చేస్తే కొడుకునైనా వ‌దిలేది లేదంటూ గాండ్రించే కేసీఆర్‌.. చేత‌ల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి ఏం చేశారు? బ‌దిలీలతో ఆయ‌నేం సందేశాన్ని ఇచ్చార‌న్న‌ది చూస్తే..

జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముచ్చ‌ట గుర్తుందిగా. బ‌తుక‌మ్మ కుంట ఆక్ర‌మ‌ణ ద‌గ్గ‌ర నుంచి అనేక వివాదాల్లోకి కూరుకుపోయిన అత‌గాడి జోరుకు క‌ళ్లాలు వేసేందుకు ప్ర‌య‌త్నించిన క‌లెక్ట‌ర‌మ్మ శ్రీ‌దేవ‌సేన బ‌దిలీ అయిపోయారు. కొంత‌లో కొంత‌న‌యం పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ గా మార్చారు. ఆమె స్థానంలో అనితను తీసుకొచ్చారు. ఇక‌.. ఐఏఎస్ అధికారి ఎట్టి ప‌రిస్థితుల్లో ఇలా మాత్రం ఉండ‌రు. ఇంత క‌ష్టం ఎవ‌రూ చేయ‌రు.

తండాల్లో.. గూడేల వెంట తిరుగుతూ.. అర్థ‌రాత్రి.. అప‌రాత్రీ అన్న తేడా లేకుండా ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న‌తో కార్ల‌ను వ‌దిలేసి.. బైకుల మీద తిరుగుతూ పేద‌ల‌కు ఏదో చేద్దామ‌న్న భూపాల‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ ముర‌ళీని తీసుకెళ్లి ఆర్కైవ్స్‌ కు బ‌దిలీ చేశారు. కొద్దిరోజుల్లో మేడారం లాంటి భారీ ఈవెంట్ జ‌రుగుతున్న వేళ ముర‌ళీకి స్థాన‌భ్రంశం అంటే ఇంకేం చెప్పాలి.

ఇక‌.. మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తీ హోళికెరి సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు.. ఆమె ప‌ని తీరుకు జాతీయ మీడియాలోనూ ప్ర‌శంస‌లు పొందిన ఆమెను జీహెచ్ ఎంసీ ప‌రిధిలోని ఒక ప్రాధాన్య‌త పోస్టుకు పంపేశారు. ఎందుకిలా అంటే.. స్థానికంగా అదికార‌ప‌క్ష ఎమ్మెల్యేతో పొస‌గ‌క‌పోవ‌ట‌మేన‌ట‌.

త‌న అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌తో క‌లెక్ట‌ర్ ప్రీతీ మీనాను ఇబ్బంది పెట్టి.. హాట్ టాపిక్ గా మారిన మానుకోట ఎమ్మెల్యే మాట‌కు తిరుగులేద‌న్న విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. అప్ప‌ట్లో మానుకోట ఎమ్మెల్యేకు సీరియ‌స్ వార్నింగ్ సీఎం నుంచి వ‌చ్చిన‌ట్లుగా ప‌త్రిక‌ల్లో వ‌చ్చినా.. ఇప్పుడు మాత్రం ప్రీతీ మీనా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి పంపేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

గిరిజ‌న సంక్షేమ క‌మిష‌న‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ను త‌ప్పించారే కానీ పోస్టింగ్ ఇవ్వ‌లేదు. ఆదివాసీ.. లంబాడాల గొడ‌వ‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇబ్బందికి గురి చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న నిర్మ‌ల్ మాజీ జిల్లా క‌లెక్ట‌ర్ ఇలంబ‌ర్తిని ఇద్ద‌రు స‌భ్యులున్న స‌మాచార క‌మీష‌న్‌కు కార్య‌ద‌ర్శిగా ప‌రిమితం చేశారు. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది ప‌డేలా చేసిన ఆయ‌న మీద త‌న ఆగ్ర‌హం ఇంకా త‌గ్గ‌లేద‌న్న విష‌యం త‌న చేత‌ల‌తో సీఎం చేసి చూపించారంటున్నారు.

ఎమ్మెల్యేల‌తో పెట్టుకున్న ఐఏఎస్ ల‌కు దిక్కు లేన‌ప్పుడు ఏకంగా మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డితో ప‌డ‌ని దివ్యను అదిలాబాద్ కు పంపంటం ద్వారా త‌న చేత‌లు ఎలా ఉంటాయో చెప్పేసిన సీఎం సార్‌.. తాజా బ‌దిలీల్లో తన లైన్ ఎలా ఉంటుందో.. అందుకు త‌గ్గ‌ట్లు అధికారులు ఎలా వ్య‌వ‌హ‌రించాలన్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అధికారుల‌కు అందాల్సిన సందేశం తాజా బ‌దిలీల‌తో అందిన‌ట్లే!