Begin typing your search above and press return to search.

మళ్లీ క్యూ లైన్లు మొదలు.. ఈసారి ఎలా డీల్ చేస్తారో?

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:08 AM IST
మళ్లీ క్యూ లైన్లు మొదలు.. ఈసారి ఎలా డీల్ చేస్తారో?
X
వరదసాయాన్ని సోమవారం నుంచి అందిస్తామన్న మంత్రి కేటీఆర్ మాట.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వరద పరిహారాన్ని ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి షురూ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట.. వెరసి ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు పరిహారం కోసం మీ సేవా సెంటర్ల వద్ద బారులు తీరారు. దీంతో.. పరిహారం ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

వరద తాకిడికి పెద్ద ఎత్తున ఇళ్లు ప్రభావితం కావటం.. అలాంటి వారికి పరిహారం కింద రూ.10వేలు చొప్పున ఇవ్వటం తెలిసిందే. ఇప్పటికే ఆరు లక్షల కుటుంబాలకు రూ.600 కోట్లకుపైనే పరిహారాన్ని అందించారు. గ్రేటర్ ఎన్నికల వేళ.. మీ సేవా సెంటర్లలో అప్లికేషన్ పెట్టినంతనే.. గంటల వ్యవధిలోనే ఖాతాలో రూ.10వేలు జమ కావటం కూడా జరిగింది.

దీంతో.. నిజమైన బాధితుల స్థానే.. వరద ప్రభావం లేని ప్రాంతాల వారు సైతం మీసేవా సెంటర్ల వద్ద బారులు తీరటం.. ఎన్నికల సంఘం పరిహారం పంపిణీని ఎన్నికల వేళ అనుమతించమని చెప్పటంతో ఆగింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల వెలువడిన వెంటనే.. పరిహారాన్ని ఇస్తామని.. అవసరమైతే మరో రూ.200, రూ.300 కోట్లు ఇచ్చేందుకు వెనుకాడమని చెప్పారు. దీంతో.. చాలామందిలో కొత్త ఆశలు చిగురించాయి. ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం (సోమవారం) నుంచి నగరంలోని చాలా మీసేవా సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. దీంతో.. ఈ పరిహారం క్యూలైన్లను ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్న ప్రశ్న తలెత్తింది.

ఇదిలా ఉంటే.. తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఒక ప్రకటన ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో విడుదలైంది. దీని సారాంశం ఏమంటే.. ‘‘వరదసాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ టీంలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి.. సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నాయి. బాధితుల వివరాలు.. ఆధార్ నెంబర్ ధ్రువీకరించుకున్న తర్వాత వారి అకౌంట్లోకి నేరుగా వరదసాయం డబ్బు జమ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ఒకవేళ.. ఇదే సరైన పద్దతి అనుకుంటే.. గ్రేటర్ ఎన్నికల వేళలో అలా ఎందుకు చేయలేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.