Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర తాజా సీన్ చూస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   19 March 2020 5:15 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర తాజా సీన్ చూస్తే అవాక్కే
X
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎప్పుడైనా వెళ్లారా? అప్పుడేం చేశారు? క్యాబ్ లు.. ప్రయాణికుల కోలాహలంతో పాటు.. వారికి వీడ్కోలు పలికేందుకు.. స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున సందడి నెలకొని ఉంటుంది. బుధవారం రాత్రి మాత్రం దీనికి భిన్నమైన సీన్ కనిపించింది. ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున 108 వాహనాల్ని సిద్ధంగా ఉంచటం తో పాటు.. పోలీసుల వాహనాలు.. ఆర్టీసీ బస్సుల తో పాటు.. వైద్య ఆరోగ్య సిబ్బంది పెద్ద ఎత్తున కనిపించారు.

గతంలో మరెప్పుడూ లేని రీతిలో కనిపించిన ఈ సీన్ చూస్తే.. సినిమాలో సీన్ గుర్తుకు తెచ్చేలా ఉంది. పూర్తి స్థాయిలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగడుగునా కనిపించింది. ఇంతకీ ఎందుకింత హడావుడి? అసలేం జరుగుతుందన్న విషయాన్ని ఆరా తీస్తే ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మలేషియా నుంచి వందలాది మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్న నేపథ్యంలో వారందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు వీలుగా.. ఆర్టీసీ బస్సుల తో పాటు.. 108 అంబులెన్స్ ల్ని సిద్ధం చేసినట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు కరోనా వ్యాప్తికి ఏ మాత్రం అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనులు చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.