Begin typing your search above and press return to search.

ఆగస్టుపై ప్రభుత్వం ఆందోళన: వైరస్ కట్టడికి ప్రత్యేక వ్యూహం

By:  Tupaki Desk   |   25 July 2020 10:30 AM GMT
ఆగస్టుపై ప్రభుత్వం ఆందోళన: వైరస్ కట్టడికి ప్రత్యేక వ్యూహం
X
దేశంలో రెండో కేసు వెలుగులోకి వచ్చింది తెలంగాణలోనే. ఆ కేసు మార్చి 2వ తేదీన హైదరాబాద్ లో తొలి కేసు నమోదైంది. అలా మొదటి కేసు నమోదై ఇప్పుడు నాలుగు నెలలకు ఏకంగా యాభై వేలు దాటాయి. వైరస్ కట్టడి నుంచి సామూహిక వ్యాప్తి వరకు సమస్య వచ్చింది. నాలుగు నెలల్లోనే వైరస్ తీవ్ర రూపం దాల్చింది. మరో నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అంటే ఆగస్టు మొత్తం వైరస్ ఉధృతి తీవ్రస్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. నిండకుండానే కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరింది.

వైరస్ ఉధృతి ఇలా..
తొలి కేసు: మార్చి 2
మార్చి నెలాఖరుకు కేసుల సంఖ్య 77
ఏప్రిల్‌ : 1,038 కేసులు
మే నెల: 2,698 పాజిటివ్
జూన్‌: 16,339
జూలై: 23 రోజులకే 50,826 కేసులు.

మరణాలు
మార్చిలో ఒకటి కాగా
ఏప్రిల్‌: 28
మే: 80
జూన్‌: 260
జూలై: 23వ తేదీ వరకు 447

ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి హైదరాబాద్‌ తో పాటు జిల్లాలకు కూడా వేగంగా విస్తరించింది. దీంతో వచ్చే నెల ఏం జరగబోతుందో అని అందరిలో ఆందోళన రేపుతోంది. జూలై చివరి వారం కలిపి ఆగస్టు నెల మొత్తం వైరస్ వ్యాప్తి తీవ్ర రూపంలో ఉండనుందని ప్రభుత్వమే ప్రకటించింది. రోజుల్లో ఎన్ని కేసులు నమోదవుతాయో చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత మొదలయ్యే ఆగస్టు నెలలో ఎన్ని కేసులు వస్తాయో ఊహించే పరిస్థితి కూడా లేదు. ఒక్క జూన్‌ నెలలోనే 16,339 కేసులు నమోదవగా జులైలో కేవలం 23 రోజుల్లోనే 34 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు మూడు వారాల్లోనే మూడు రెట్లకు మించి కేసులు నమోదయ్యాయి. దీన్ని అనుసరించి అంచనా వేస్తే కేసులు మరింత రెట్టింపు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తోంది. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయి. రెండో దశ (సెకండ్‌ వేవ్‌) ఆగస్టులో ప్రారంభమై, సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తీవ్రంగా ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తెలిపింది.

వైరస్‌ హైదరాబాద్‌ మహానగరం నుంచి జిల్లాలకు, ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తోంది. ఆగస్టులో వైరస్ ముప్పుకు కట్టడి చేసేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది. నిర్దారణ పరీక్షలు పెంచడం.. వైద్య సౌకర్యాలు రెట్టింపు చేయడమే పరిష్కారం గా కనిపిస్తోంది. సాధారణ జ్వరం, జలుబు, ఇతరత్రా లక్షణాలతో ఉన్నవారికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎవరికి జ్వరం వచ్చినా వైరస్ నిర్దారణ పరీక్ష కంటే ముందే వారిని ఇంటింటికి వెళ్లి గుర్తించాలి. లేదా బాధితుడు తక్షణం సమీప వైద్యుడిని సంప్రదించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. జ్వరం వచ్చిందంటే చాలు నిర్దారణ పరీక్ష కంటే ముందే కరోనాకు ఇస్తున్న చికిత్సను తక్షణమే ప్రారంభిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా యాంటిబయోటిక్స్, జ్వరం, దగ్గు, జలుబు తగ్గేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇస్తున్న కిట్లను అందజేసి చికిత్సను ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే కరోనా నిర్దారణ పరీక్ష చేస్తారు. ఇలా తక్షణం చికిత్స చేయడం ద్వారా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా రోగిని కాపాడుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో విరివిగా యాంటిజెన్‌ టెస్ట్‌లు చేసేలా నిర్ణయం తీసుకోనుంది.

ఇక జిల్లాల్లో కూడా ఇదే వ్యూహం అమలుచేసేలా పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచీ నిర్దారణ పరీక్ష, చికిత్సలు అందించే ఏర్పాట్లు చేస్తారు. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న వైద్య పరీక్షలు, చికిత్సలు జిల్లా, మండల స్థాయి వరకు విస్తరించనున్నారు. ఈ వ్యూహంతో వైరస్ ను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జ్వరం వచ్చిన వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌కు గురై వెంటిలేటర్‌ మీదకు రాకుండా చేయడమే ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధంగా ఆగస్టు ముప్పు కు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మన జాగ్రత్తలు మనం పాటిస్తే వైరస్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.