Begin typing your search above and press return to search.

కేంద్రం బాట‌లో తెలంగాణ‌: జూన్ 30 వ‌ర‌కు లాక్‌ డౌన్‌

By:  Tupaki Desk   |   31 May 2020 11:32 AM GMT
కేంద్రం బాట‌లో తెలంగాణ‌: జూన్ 30 వ‌ర‌కు లాక్‌ డౌన్‌
X
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తోంది. ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా వైర‌స్ వ్యాప్తి ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇక ప్ర‌జ‌లు ఆ వైర‌స్‌తో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే లాక్‌డౌన్ విధిస్తూనే ఆంక్ష‌ల‌న్నింటిని ఎత్తేస్తున్నారు. తాళం వేస్తారు.. కానీ ఇల్లు తెరిచి ఉన్న‌ట్టు లాక్‌ డౌన్ 5 తీరు ఉంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌ డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 31వ తేదీతో ఉన్న లాక్‌ డౌన్ 4 ముగియ‌నుంది. ఇప్పుడు తాజాగా లాక్‌ డౌన్ 5 జూన్ 1వ తేదీ నుంచి 30 వ‌ర‌కు విధించారు. కేంద్రం మాదిరి తెలంగాణ కూడా వెళ్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కూడా లాక్‌ డౌన్ పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్రంలోని కంటైన్‌ మెంట్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కంటైన్‌ మెంట్‌ జోన్ల వెలుపల జూన్ 7వ తేదీ వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ఆదివారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో వెల్ల‌డించింది. ఈ మేరకు లాక్‌ డౌన్‌ నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది. దవాఖానాలు - మందుల దుకాణాలు మినహా ఇతర అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 8 గంటల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై కూడా నిషేధం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసినట్లయ్యింది. దీంతో మ‌హారాష్ట్ర‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్‌ - క‌ర్నాట‌క రాష్ట్రాల‌కు రాక‌పోక‌లు మొద‌లుకానున్నాయి.