Begin typing your search above and press return to search.

‘‘కృష్ణ’’ మీద మా గోడు వినరా?

By:  Tupaki Desk   |   18 Nov 2016 4:19 AM GMT
‘‘కృష్ణ’’ మీద మా గోడు వినరా?
X
కృష్ణ జలాల మీద తమ వాటాకు సంబంధించిన అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణా నీటి పంపిణీ ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్యేనని చెప్పటం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర వాదనను పరిగణలోకి తీసుకోవాలని.. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కృష్ణా జలాల వాటా నుంచి పంచుకుంటే తమకు లభించేది పెద్దగా ఏమీ ఉండదని.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్ని మరోసారి న్యాయ సమ్మతంగా పంచాలని తెలంగాణ సర్కారు కోరుతోంది. దీనిపై పలు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవటంతో.. ఆ మధ్యన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ అంశంపై ఇటీవల జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ తెలంగాణ వాదనపై స్పందిస్తూ.. విభజన చట్టం సెక్షన్ 89ప్రకారం నీటి పంపిణీ కేవలం రెండు కొత్త రాష్ట్రాల మధ్యేనని.. దీంతో కర్ణాటక.. మహారాష్ట్రలకు సంబంధం లేదని తీర్పు చెప్పటాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు అటార్నీ జనరల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్.. ఉమ్మడి వాటా నుంచి నీటిని పంచితే తమకు దక్కేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. తమ న్యాయమైన వినతిని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వినిపించలేకపోయామని.. వినిపించే అవకాశం ఇవ్వాలని.. లేదంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం ద్వారా అయినా తమకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లుగా వెల్లడించారు. అయినా.. తమ సమస్యను కేంద్రం పరిష్కరించలేదని.. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లుగా వెల్లడించారు.

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకోకుండా.. ఎలాంటి పరిశీలన లేకుండా.. తమ గోడు వినకుండా ఉమ్మడి జలాల నుంచి వాటా పంచుకోవాలని ఎలా తేల్చేస్తారు? నదీ పరివాహన ప్రాంతంలో ఉన్న కర్ణాటక.. మహారాష్ట్ర.. ఏపీకి ఎలా అయితే హక్కులు ఉన్నాయో తమకూ అలానే హక్కులు ఉంటాయి కదా? అంటూ తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పటం గమనార్హం. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఈ వ్యవహారంలో కర్ణాటక.. మహారాష్ట్రలకు సంబంధం లేదని వాదనను వినిపించారు.ఇలా ఎవరి వాదనలు వారు వినిపించగా ఈ కేసును 2017 జనవరికి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలపై తమ వాదనను తెలంగాణ ప్రభుత్వం బలంగా వినిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/