Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పేగా అయితే..!

By:  Tupaki Desk   |   20 Jun 2020 2:00 PM GMT
తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పేగా అయితే..!
X
ఒక్క రోజులో 499 కేసులు. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణకు నిదర్శనం ఇది. శుక్రవారం నమోదైన ఈ కేసులు ఆల్ టైం రికార్డు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్న ప్రభుత్వం చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 2500 దాకా ఉండగా.. అందులో 20 శాతం దాకా పాజిటివ్‌గా తేలాయి.

ఇంతకుముందు రోజుకు కొన్ని వందల టెస్టుల మాత్రమే చేసేవాళ్లు. అందులో 10-20 శాతం పాజిటివ్‌గా తేలేవి. దీంతో రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదన్నట్లుగా చెప్పుకునేది ప్రభుత్వం. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు కూడా పెరుగుతాయని.. అది చాలా అవసరమని.. ఎందరు ఎంతగా మొత్తుకున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోయింది. చివరికి హైకోర్టు ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు సీరియస్ కావడం.. హెచ్చరికలు జారీ చేయడంలో టెస్టులు పెంచాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ సహా కొన్ని ప్రాంతాల్లో కలిపి 50 వేల టెస్టులు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే రోజూ వేలల్లో టెస్టులు చేస్తుంటే.. వందల్లో కేసులు బయటపడుతున్నాయి. దీన్ని బట్టి ఇన్నాళ్లూ టెస్టులు చాలా తక్కువ చేయడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను బాగా తగ్గించి చూపగలిగారన్నది స్పష్టం. ఇది కచ్చితంగా ప్రభుత్వం తప్పిదమే. శుక్రవారం నాటి కేసుల్ని విశ్లేషిస్తే రాష్ట్రంలో వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కరోనా బాధితుల్లో బండ్ల గణేష్ లాంటి ప్రముఖ నిర్మాత ఉన్నాడు. కొండాపూర్ ఏరియాలోని ఒక హాస్పిటల్లో ఒకేసారి ఏకంగా 33 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఓ మీడియా సంస్థలోని అడ్వర్టైజ్మెంట్ విభాగంలో ఒకేసారి 18 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే నలుగురు ఐపీఎస్ అధికారులు కరోనా పాజిటివ్‌గా తేలారు. దీన్ని బట్టి కరోనా రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో విస్తరించిందని స్పష్టమవుతోంది.