Begin typing your search above and press return to search.

కేసీఆర్ రూ.5కోట్లు కేటీఆర్ పుణ్యమా?

By:  Tupaki Desk   |   21 Aug 2016 4:58 AM GMT
కేసీఆర్ రూ.5కోట్లు కేటీఆర్ పుణ్యమా?
X
అనుకున్నదే జరిగింది. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ‘సిల్వర్’ స్టార్ సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమెకిచ్చేనజరానా గురించి ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనకు కొద్ది గంటల ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు రూ.3కోట్ల నగదు.. అమరావతిలో 1000 గజాల స్థలంతో పాటు.. గ్రూపు 1 ఉద్యోగాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఏపీతో పోటీ పడే తీరుకు తగ్గట్లే.. సింధు విషయంలోనూ కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆమెకు భారీ నజరానా ప్రకటించారు.

గతంలోనూ సింధుకు సాయం అందిస్తామని.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోటి రూపాయిలు నజరానా ప్రకటించటంతో పాటు.. ఆమెకు మెరుగైన శిక్షణకు అవసరమైన నిధులు ఇవ్వటం ద్వారా ఆమె మరిన్ని టైటిళ్లు సొంతం చేసుకోవటానికి అవకాశం కలిగించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. బాబు కంటే భారీగా కేసీఆర్ నజరానా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలకు తగ్గట్లే కేసీఆర్ ప్యాకేజీ ఉండటం గమనార్హం. రూ.5కోట్ల నగదు పురస్కారం.. భూమితో పాటు.. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. చంద్రబాబు మాదిరే ఆమెతో పాటు ఆమె గురువు గోపీకి నజరానా ప్రకటించారు.

సింధుకు రూ.5కోట్లు నజరానా ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ ప్రముఖ భూమిక పోషించారని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.కోటి మాత్రమే ప్రకటించే వీలుంది. అయితే.. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నజరానా భారీగా ఉండాలని.. పక్కనున్న ఏపీకంటే ఎక్కువ ఉండాలన్న తపన సింధుకు మెరుగైన కానుకల్ని కేసీఆర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రీడల అభివృద్ధికి ఈ మాత్రం మొత్తం ఇవ్వాలని.. సంబంధం లేని రాష్ట్రాలు సైతం సింధుకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ అందుకు తగ్గట్లుగా నజరానా ప్రకటించకపోతే బాగోదన్న వాదనకు కేసీఆర్ కన్విన్స్ అయ్యారని చెబుతున్నారు. అందుకే భారీ ప్యాకేజీకి ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. తెర వెనుక ఏం జరిగినా.. సింధుకు ప్రకటించిన నజరానాలలో తెలంగాణ ప్రభుత్వం తిరుగులేనిదిగా నిలిచిందనటంలో సందేహం లేదు.