Begin typing your search above and press return to search.

కిక్ ఇచ్చావ్‌... కేసీఆర్ !

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:59 AM GMT
కిక్ ఇచ్చావ్‌... కేసీఆర్ !
X
మందుబాబుల‌కు మందు తాగ‌కుండానే కిక్ ఎక్కేలాంటి మాట‌ను తెలంగాణ స‌ర్కారు తాజాగా చెప్పింది. మ‌ద్యం పాల‌సీల‌పై తాజాగా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. కొన్ని కీల‌క‌మైన నిర్ణ‌యాల్ని తీసుకున్నారు. అక్టోబ‌రు 1 నుంచి వైనుషాపుల్లో మాత్ర‌మే కాదు.. షాపింగ్ మాల్స్ లో కూడా అమ్మేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

రానున్న రెండేళ్ల‌లో రాష్ట్ర ఎక్సైజ్ పాల‌సీని తాజాగా విడుద‌ల చేశారు. ఈ పాల‌సీ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి.. నిర్దేశిత ఫీజు క‌ట్టే ప్ర‌తి షాపింగ్ మాల్‌ కు మ‌ద్యం అమ్ముకునే వెసులుబాటు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపే వైన్ షాపులు ఇప్పుడున్న రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యాన్ని మ‌రింతగా పెంచుతూ.. దాన్ని రాత్రి 11 గంట‌ల‌ వ‌ర‌కూ పొడిగించారు.

రానున్న రెండేళ్ల కాల వ్య‌వ‌ధి (2017-19) కాలానికి మ‌ద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేష‌న్‌ ను జారీ చేశారు. 2216 మ‌ద్యం దుకాణాల‌కు ఎక్సైజ్ ముఖ్య‌కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం అక్టోబ‌రు ఒక‌టి నుంచి 2019 సెప్టెంబ‌రు 30 వ‌ర‌కూ కాల వ్య‌వ‌ధిలో లైసెన్స్ ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. లాట‌రీ ప‌ద్ధ‌తిలో షాపు ఎవ‌రికి ఇవ్వాల‌న్న‌ది నిర్ణ‌యిస్తారు.

అయితే.. తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ లో ద‌ర‌ఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచేయ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో ఉన్న రూ.50వేల ద‌ర‌ఖాస్తు ఫీజు స్థానే ఇప్పుడు రూ.ల‌క్ష‌గా మార్చారు. అంతేకాదు.. లైసెన్స్ ఫీజులో 10 శాతాన్ని ఈఎండీ కింద క‌ట్టాల‌ని.. లాట‌రీలో షాపు రాని నేప‌థ్యంలో ఈఎండీని తిరిగి చెల్లిస్తార‌ని చెబుతున్నారు. గ‌తంలో ఉన్న ఆరు శ్లాబులు తీసేసి నాలుగు శ్లాబుల్ని చేశారు. తాజా అంచ‌నా ప్ర‌కారం.. కొత్త ఎక్సైజ్ పాల‌సీతో ప్ర‌భుత్వానికి రూ.15వేల‌ కోట్లు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ద‌ర‌ఖాస్తు ఫీజు పెంచ‌టంతో రూ.100 కోట్లు.. లైసెన్స్ ఫీజు పెంపుతో మ‌రో రూ.100 కోట్లు అద‌నంగా ఆదాయం స‌మ‌కూర‌నుంద‌ని తెలుస్తోంది.

కొత్త‌గా ఏర్పాటు చేసే మ‌ద్యం షాపుల్లో సీసీ కెమేరాలు త‌ప్ప‌నిస‌రి చేశారు. మ‌ద్యం షాపుల కేటాయింపు విష‌యంలో సుప్రీంకోర్టు గైడ్ లైసెన్సుల్ని ఫాలో కానున్న‌ట్లుగా ఎక్పైజ్ శాఖాధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఏమైనా.. ఇప్ప‌టికే ఎక్కువైంద‌నుకున్న మ‌ద్యం.. మాల్స్ లో ద‌ర్శ‌నం ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. రాత్రిళ్లు 11 గంట‌ల వ‌ర‌కూ బార్లు మ‌ద్యం పంపిణీ చేయొచ్చ‌ని అధికారికంగా చెబితే.. వాస్త‌వ ప‌రిస్థితి మ‌రెలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మొత్తానికి మ‌ద్యం మ‌త్తులో దించేసే ప్రోగ్రాంను తెలంగాణ స‌ర్కారు షురూ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ప్పుడు జ‌నాలు మ‌రికాస్త ఎక్కువ మ‌త్తులో ఉంటే మాత్రం ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏముంటుంది?