Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి చేసిన ట్విట్ చూసి సంబరపడిపోతున్న కేటీఆర్!

By:  Tupaki Desk   |   9 May 2020 11:30 AM GMT
కేంద్రమంత్రి చేసిన ట్విట్ చూసి సంబరపడిపోతున్న కేటీఆర్!
X
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్నప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఒకవైపు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు రైతుల కోసం ఆలోచిస్తూ , వారికీ ఉపయోగపడేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో రైతులు భాదపడకూడదు అని భావించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను ..సరైన మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పి .. క్షేత్ర స్థాయిలో అది అమలైయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 34.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని మళ్లిస్తుండటంతో.. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణలో వరిని సాగు చేశారు. అలాగే కేసీఆర్ చెప్పినట్టు గానే ... ప్రతి గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. దీంతో దేశం మొత్తంలో వరి సేకరణలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. మిగతా రాష్ట్రాలకు అందనంతగా భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించింది. ఈ రబీలో తెలంగాణలో 34.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ‘గౌరవ కేంద్రం మంత్రి పాశ్వాన్ వెల్లడించిన ప్రకారం యాసంగి సీజన్లో వరి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రైతులు, ప్రజలకు ఇది గర్వకారణం. ఆరు ఏళ్లలోపే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతలా మారిపోయింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రబీ సీజన్లో దేశవ్యాప్తంగా సేకరించిన వరి ధాన్యంలో తెలంగాణ టాప్‌లో నిలవగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ 10 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి పాశ్వాన్ తెలిపారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలు వ్యవసాయానికి దేశానికే ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి.