Begin typing your search above and press return to search.

కొండపల్లి శరత్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడంటే.. సంచలనమే

By:  Tupaki Desk   |   3 Dec 2020 2:00 PM GMT
కొండపల్లి శరత్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడంటే.. సంచలనమే
X
కొండపల్లి శరత్.. ఈ పేరులో ఎలాంటి ప్రత్యేకత లేదు. నిజానికి.. అతనెవరు? అని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేవారు ఉండరు. కానీ.. సోషల్ మీడియాలో.. అందునా ఫేస్ బుక్ లో అదే పనిగా పోస్టులు పెట్టేవారు.. ఆ మాథ్యమంతో ఎంగేజ్ అయినోళ్లకు మాత్రం కొండపల్లి శరత్ గురించి కాస్త ఐడియా ఉంటుంది. తాజాగా అతను పోస్టు చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇతని ప్రత్యేకత ఏమంటే.. రైతాంగ సమస్యల మీద పోస్టు పెడితే.. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా స్పందించటం గమనార్హం.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని నందులపల్లికి చెందిన అతడు.. గతంలో భూ సమస్య గురించి శరత్ ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ పోస్టు సీఎం కేసీఆర్ వరకు వెళ్లింది. ఆ చిట్టి వీడియోను చూసిన ఆయన.. శరత్ కు ఫోన్ చేసి.. సమస్యను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో ఆ వ్యవహారం సంచలనంగా మారటమే కాదు.. రెండు రోజుల్లో అతని సమస్య పరిష్కారమైంది. అలా వార్తల్లోకి తొలిసారి వచ్చారు శరత్. కట్ చేస్తే.. తాజాగా అతడో పోస్టు పెట్టారు. అందులో ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయటం లేదంటూ తాజాగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

తమ ఊళ్లో ఏడు ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశాడు శరత్. దాదాపు 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతలు పూర్తి చేసుకొని పదిహేను రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం అతడి పంటను కొనుగోలు చేయలేదు. వ్యాపారులు కూడా ముందుకు రాలేదు. దీంతో.. దాన్యం రాశుల వద్దే ఉండిపోయాడు. పలువురు ధర తగ్గించి అడగటం.. కొనుగోలు కేంద్రం లేకపోవటంతో.. ఆ సమస్యలతో.. ‘మన వ్యవసాయం.. మన పంటలు’ ఫేస్ బుక్ పేజీలో తన సమస్యను ప్రస్తావిస్తూ వీడియోను పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ గా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వెళ్లటంతో ఆయన.. శరత్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని ఎవరూ కొనటం లేదన్న అతడి మాటలతో వెంటనే జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి ఈ ఇష్యూను అప్పజెప్పారు. అంతే.. ప్రభుత్వ యంత్రాంగం కదలటమే కాదు.. కలెక్టర్ ఆదేశాల పుణ్యమా అని వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి.. కాంటా వేశారు. అంతేకాదు.. అతని మండలంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. దీంతో.. మరోసారి అతడు వార్తల్లోకి వచ్చాడు.