Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారం..

By:  Tupaki Desk   |   28 Nov 2018 9:05 AM GMT
తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారం..
X
తెలంగాణ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటాన్నాయి. తాజాగా ఆంధ్రాలోని ప్రజలకు ఓటేయండి అంటూ తెలంగాణ శాసన సభకు పోటీపడుతున్న అభ్యర్థుల నుంచి ఫోన్లు - ఎస్ ఎంఎస్ లు వెళుతున్నాయి. ఇదేంటీ తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారమేంటీ అనుకుంటున్నారా.. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు ఆశ్రయిస్తున్న ఆధునిక పద్ధుతులే ఇందుకు కారణం. ఐవీఆర్ ద్వారా రికార్డయిన సందేశాలు - వాట్సాప్ - ఎస్ ఎంఎస్ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో చాలా ఫోన్లు - సందేశాలు ఏపీకి వెళుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే ఆంధ్రా పాంత్రానికి చెందినవారు అధికంగా తెలంగాణలో - ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వీరంతా అటు తమ సొంత జిల్లాల్లో - ఇటు హైదరాబాద్ లోని నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకున్నారు. ఇలాంటి వారు దాదాపు 20లక్షల పైనే ఉన్నారు. స్థానికత - వృత్తి - ఉపాధి తదితర కారణాలతో రాష్ట్ర విభజన అనంతరం చాలా మంది తిరిగి ఏపీకి వెళ్లి పోయారు. వీరందరి ఫోన్లలో ఇపుడు తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

ఉదయం లేచినప్పటీ నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో సందేశాలు - రికార్డెడ్ వాయిస్ కాల్స్ వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి ఓట్లను తొలగించాలని ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. గతవారం విచారణకు వచ్చిన సందర్భంగా అనుమానస్పదంగా ఉన్న దాదాపు 19లక్షల ఓట్లపై విచారణ చేపిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలదీ అదే పరిస్థితి. విభజన చట్టం ప్రకారం ఖమ్మంలోని చింతూరు - కూనవరం - వరరామచంద్రాపురం మండలాలు - పినపాక పరిధిలోని బూర్గంపాడు - అశ్వరావుపేటలోని కుక్కునూరు - వేలేరుపాడుతోపాటు భద్రాచలంలోని భద్రచాలం పట్టణం మినహా మిగతా మండలాలను ఏపీలో కలిపేశారు. ఈ మండల్లాలోని ఓటర్లను కూడా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు ఓటువేసి గెలిపించాలని ఎస్ ఎంఎస్ లు - వాయిస్ కాల్స్ ద్వారా కోరుతున్నారు. వీరు 34వేల కుటుంబాల వరకు ఉంటారు. దాదాపు 1.20లక్షల ఓట్లు ఉండొచ్చని అంచనా.

ఈ పరిస్థితి 2024 వరకు ఇలాగే ఉండేట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ - ఏపీలు ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ పరిధిలోనే ఉండేవి. తరువాత రెండుగా విడిపోయాయి. కానీ సర్కిల్ పరిధిలో ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఈ రెండు ప్రాంతాల్లో ఎలాంటి రోమింగ్ చార్జీలు ఉండవు. ఆ కారణంగా అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ప్రచార సందేశాలు పంపుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రెండు చోట్ల ఓట్లు ఉండటం - ఏపీ - తెలంగాణకు 2024వరకు ఎలాంటి రోమింగ్ చార్జీలు పడకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు.

శేరిలింగంపల్లి - కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థి వేరే రాష్ట్రంలోని అమరావతి - విజయవాడ ఓటర్లను తనకు ఓటేయండి ప్రచారం చేయడం.. తనను గెలిపించాలని కోరడంపై అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికల వేళ ఈ విడ్డూరం చోటు చేసుకుంటోంది.