Begin typing your search above and press return to search.

పట్టబడ్డ నగదు ఎంత? దొరికిన లిక్కర్ ఎంత?

By:  Tupaki Desk   |   5 Dec 2018 5:19 PM GMT
పట్టబడ్డ నగదు ఎంత? దొరికిన లిక్కర్ ఎంత?
X
రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అంతా సిద్ధం చేస్తోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 25 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రంలో మోహరించాయి. ఆరు రాష్ట్రాల నుంచి భద్రతా సిబ్బంది రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ 48 గంటలే కీలకం కాబట్టి.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పోలీసుల తనిఖీల్లో 86 కోట్ల 59 లక్షల 84 వేల 575 రూపాయల నగదు పట్టుబడింది. ఐటీ శాఖ అధికారులు 23 కోట్ల 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.10 కోట్ల విలువైన 5 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.

ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రంలో 414 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయి. 404 ఎస్ఎస్టీలు, 3,385 మొబైల్ పార్టీలు మోహరించాయి. ఇప్పటివరకు 1 వెయ్యి 314 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 17 వేల 841 సెక్యూరిటీ కేసులు నమోదు చేశారు. 90 వేల 128 మందిపై బైండోవర్లు పెట్టారు. 8 వేల 481 లైసెన్సుడ్ వెపన్స్ పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ అయ్యాయి. ఇక కోడ్ ఉల్లంఘనకు సంబంధించి రాష్ట్రంలో 1 వెయ్యి 172 కేసులు నమోదు చేశారు. 11 వేల 852 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. డబ్బు, మద్యం పంపిణీపై పోలీసులు నిఘా పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని లా అండర్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసు శాఖ కోరింది. ప్రజలు నిర్భయంగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేలా భద్రత కల్పిస్తున్నామని తెలిపింది.