Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా టాక్స్ : ఆంధ్రా సీఎంకు తెలంగాణ డైరెక్ష‌న్ !

By:  Tupaki Desk   |   18 May 2022 4:55 AM GMT
సోష‌ల్ మీడియా టాక్స్ :  ఆంధ్రా సీఎంకు తెలంగాణ డైరెక్ష‌న్ !
X
రెండు ప్రాంతీయ పార్టీల‌వి. ఒక‌టి తెలంగాణ రాష్ట్ర స‌మితి..రెండు యువ‌జ‌న శ్రామిక రైతు పార్టీ.. ఒక‌టి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుది.. మ‌రొక‌టి యెడుగూరి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది. పేరుకు రెండు పార్టీలే కావొచ్చు. రెండూ క‌లిసి ప్రయాణిస్తున్న తీరే అత్యంత ఆస‌క్తిదాయ‌కం. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ డైరెక్ష‌న్ బాగానే ప‌నిచేసింది అన్న మాట‌లు కూడా విన‌వ‌చ్చాయి.

ఆ విధంగా అటు కేసీఆర్ ఇటు జ‌గ‌న్ కలిసే రాజకీయ వ్యూహం రాశార‌న్న మాట‌లూ వ‌చ్చాయి.ఇంకొన్ని వ‌స్తున్నాయి కూడా ! ఇద్ద‌రికీ ఆధ్యాత్మిక గురువులు ఒక్క‌రే కావ‌డం ఇంకా విశేషం. ఇద్ద‌రూ అటు స్వ‌రూపానందేంద్ర‌ను ఇటు చిన జియ‌రు స్వామిని విప‌రీతంగా న‌మ్ముతారు. ఆ విధంగా ఇద్ద‌రూ త‌మ త‌మ దారుల్లో వెళ్తూనే ఒకరికొక‌రు స‌హక‌రించుకుంటూ ఉన్నారు.

ఆ విధంగానే మై హోం రామేశ్వ‌ర్ కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని, ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డం ఖాయం అని అనుకున్నారు. కానీ ఆయనకు కేసీఆర్ కు చెడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే రాజ్యసభ సీటు రాకపోవడానికి కూడా కారణమై ఉండొచ్చంటున్నారు. ఇక తాజాగా రాజ్య స‌భ స‌భ్యుల ఎంపిక‌ల్లో ఇద్ద‌రు ఆంధ్రాతో సంబంధాలు నెరపే తెలంగాణ ప్రాంతీయులు కావ‌డం విశేషం.

ఇదేం త‌ప్పుకాకపోయినా పార్టీలో ఉన్న ఆశావాదులంతా నిరాశ‌లో మునిగిపోయారు. కిల్లి కృపారాణి లాంటి లీడ‌ర్లు త‌మ‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని, త‌గిన స‌మ‌యంలో త‌గిన నిర్ణ‌యం జ‌రిగి త‌గిన రీతిలో గౌర‌వం ద‌క్కుంతుంది అని భావించినా అది కూడా జ‌ర‌గ‌లేదు.

బీసీల‌కు గౌర‌వం ఇస్తున్నామ‌ని చెప్పి ఓ విధంగా తెలంగాణ సీఎం డైరెక్ష‌న్లోనే ఆర్.కృష్ణ‌య్య‌కు ప‌ద‌వి ఇచ్చారు అన్న విమర్శ కూడా టీడీపీ వినిపిస్తోంది సోష‌ల్ మీడియాలో ! అదేవిధంగా నిరంజ‌న్ రెడ్డి నియామ‌కం కూడా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ప‌లువురు న్యాయ‌వాదులు అంటున్నారు.

అంటే ఒక‌టి విధేయ‌త రెండు అనుకూల‌త మూడు అవ‌స‌రం నాలుగు విశ్వ‌స‌నీయ‌త ఈ నాలుగూ ఆ న‌లుగురి విష‌యంలో ప‌నిచేశాయి అని అనుకోవ‌డం క‌న్నా వారి ఎంపిక నిర్ణ‌యంలో కేసీఆర్ ప్ర‌భావం కూడా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం అని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.