Begin typing your search above and press return to search.

కళ్లు తెరిచిన ఈసీ.. టీ మండలి ఎన్నికలకు వాయిదా.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   14 May 2021 5:30 AM GMT
కళ్లు తెరిచిన ఈసీ.. టీ మండలి ఎన్నికలకు వాయిదా.. ఇప్పుడేం జరగనుంది?
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా అప్రదిష్టను మూటగట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఎట్టకేలకు కళ్లు తెరిచింది. కొవిడ్ సెకండ్ వేవ్ ముప్పు వెంటాడుతున్న వేళ..ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు.. స్థానిక ఎన్నికలకు సంబంధించిన హడావుడి.. పెద్ద ఎత్తున కరోనా కేసుల నమోదుకు కారణమైందన్న సంగతి తెలిసిందే. కొవిడ్ వేళ.. ఎన్నికలు తప్పనిసరి అనుకుంటే.. అందుకు తగ్గట్లుగా ఆచితూచి అన్నట్లుగా కొత్త పరిమితులతో ఎన్నికల్ని నిర్వహించి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా తూతూ మంత్రంగా చేపట్టిన చర్యలు కేసుల సంఖ్యను విపరీతంగా పెరగటానికి కారణమయ్యాయి. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

ఇలాంటివేళ.. త్వరలో నిర్వహించాల్సిన ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా స్పందించింది. జూన్ 3న ఖాళీ కావాల్సిన మండలి ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఎన్నికల్ని ఇప్పటికైతే నిర్వహించే అవకాశం లేదని తేల్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపత్యంలో సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఉన్న కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల్ని నిర్వహించటం సరికాదని భావిస్తున్నట్లుగా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు ఎమ్మెల్సీ సభ్యుల పదవీ కాలం జూన్ మూడున ముగియనుంది. వీరితో పాటు.. గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీ కాలం జూన్ 16న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ షురూ అవుతుందని భావించారు. అందుకు భిన్నంగా ఈసీ బ్రేకులు వేయటంతో ఎన్నికలు మరికాస్త ఆలస్యంగా జరుగుతాయని భావిస్తున్నారు.

అంతా కాలిపోయిన తర్వాత ఇలాంటి నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి అంతగా ఉండదు. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఖాళీ అవుతున్న ఆరు స్థానాలకు అధికార టీఆర్ఎస్ కు తప్పించి.. మరెవరికీ బలం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ.. ఈసీ ముందుచూపుతో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. తొలుత అంతులేని నిర్లక్ష్యం.. ఇప్పుడేమో అవసరానికి మించిన అప్రమత్తత.

జూన్ 3తో పదవీ కాలం ముగిసే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు

- మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్
- మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
- మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
- మాజీ మంత్రి ఫరీదుద్దీన్
- ఆకుల లలిత