Begin typing your search above and press return to search.

ఆరోగ్యం పై పడ్డ తెలంగాణ కాంగ్రెస్!

By:  Tupaki Desk   |   29 Jan 2023 12:39 PM GMT
ఆరోగ్యం పై పడ్డ తెలంగాణ కాంగ్రెస్!
X
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ లోపాలపై ప్రతిపక్షాలు ఎక్కు పెడుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని టీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. హెల్త్ ప్రొఫైల్ ను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ 16 అంశాలతో కూడిన చార్జ్ షీట్ ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా వైద్య రంగలో డాక్డర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని, ఈ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదో తెలపాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల ఆరోగ్య విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిందేమీ లేదని, అసలు ఆ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు బీఆర్ఎస్ ద్వారా జరిగిన అన్యాయాలను బయటపెడుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు సరైన వైద్యం అందించడం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యుల నియామకం కూడా ఆగిపోయిందన్నారు. కాగ్ రిపోర్టు ప్రకారం పీహెచ్ సీల్లో 43 శాతం సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు అవసరం మేరకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

తెలంగాణ జనాభా ప్రకారం రాష్ట్రంలో 1600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. కానీ 50 శాతం సిబ్బంది మాత్రమే ఉన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇలా సిబ్బంది కొరతతో ప్రభుత్వాసుపత్రులు కొట్టుమిట్టాడుతున్నందున ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక బిల్లులతో అప్పుల పాలవుతున్నారన్నారు. మొత్తంగా ప్రజారోగ్యం విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

వైద్య రంగానికి నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆ రంగంపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో చాలా వరకు సౌకర్యాలు లేవన్నారు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన మెడిసిన్ ను కూడా అందుబాటులో లేవన్నారు. దీంతో 87 శాతం మంది రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్కీంకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. అన్ని ప్రైవేట్, నెటవర్క్ ఆసుపత్రులకు రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాలన్నారు. దీంతో సదరు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ చికిత్సలు ఆపేస్తున్నారన్నారు.