Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌లో సంక్రాంతికి ముందే భోగి మంట‌లు.. 13 మంది రిజైన్‌!

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:12 PM GMT
టీ కాంగ్రెస్‌లో సంక్రాంతికి ముందే భోగి మంట‌లు.. 13 మంది రిజైన్‌!
X
తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్రాంతి పండుగ‌కు నెల రోజుల ముందుగానే భోగి మంట‌లు తారాస్తాయిలో మండుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన కమిటీలపై ముదిరిన సంక్షోభం మ‌రింత పెరిగింది. వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నేతలు కాంగ్రెస్‌ కమిటీలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తమ రాజీనామా పత్రాలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ వెంకటేశ్‌, ఎర్ర శేఖర్‌, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేశ్‌ తదితరులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం సిద్ధమైంది. ప్రధానంగా అసంతృప్తి నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఆయా నాయకుల వ్యాఖ్యలు పార్టీని ఏ విధంగా దెబ్బతీసేటట్టు ఉన్నాయో స్పష్టం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్రకు అసంతృప్తి నేతలు తెరతీస్తున్నారనే దిశలో గట్టిగా స్పందించాలని రేవంత్‌ వర్గం భావిస్తోంది. మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీకి నష్ట నివారణ చర్యలు అధిష్ఠానం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకుని అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో సమావేశం కానుంది.

కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ రెడ్డిని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఎరవత్రి అనిల్‌ ఆరోపించారు. రేవంత్‌ చేసే పాదయాత్రను దెబ్బ తీయాలని చూస్తున్నారన్న ఆయన.. ముసుగు వీరులు బయటకు వచ్చారని విమర్శించారు. అసమ్మతి నేతల లోపాయికారి ఒప్పందం బీజేపీతోనా బీఆర్ఎస్తోనా..? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టికి కమిటీల సమాచారం లేదనేది అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి సంక్రాంతికి ముందే.. కాంగ్రెస్‌లో మంట‌లు రాజుకోవ‌డంతో పార్టీప రిస్థితి మ‌రింత సంక‌ట స్థితికి చేరుకుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.