Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో సంక్షోభం : నేతల రాజీనామాల కలకలం

By:  Tupaki Desk   |   18 Dec 2022 12:38 PM GMT
కాంగ్రెస్ లో సంక్షోభం : నేతల రాజీనామాల కలకలం
X
కాంగ్రెస్ లో సంక్షోభం మొదలైంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు నచ్చక ఇప్పటికే పలువురు బీజేపీలో చేరగా.. మరికొందరు అసమ్మతి రాజేస్తున్నారు. ఇటీవలే పార్టీలో పదవులు దక్కక కొండా సురేఖ లాంటి వారు రాజీనామాలు చేశారు. ఇప్పుడు మరింత మంది ఆ బాటలో నడవడంతో కాంగ్రెస్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి.

కాంగ్రెస్ పరిస్థితులు చేయిదాటుతున్నాయి. వలస వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారన్న సీనియర్ల ఆరోపణలతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు రాజీనామా బాటపట్టారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, ఎర్ర శేఖర్, చారుగొండ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. 13మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తూ మాణిక్కం ఠాగూర్ కు లేఖ పంపారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 13 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ వర్గం సిద్ధమైంది. ప్రధానంగా అసంతృప్తి నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఆయా నాయకుల వ్యాఖ్యలు పార్టీని ఏ విధంగా దెబ్బతీసేటట్టు ఉన్నాయో స్పష్టం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రకు అసంతృప్తి నేతలు తెరతీస్తున్నారనే దిశలో గట్టిగా స్పందించాలని రేవంత్ వర్గం భావిస్తోంది. ఇక అధిష్టానం రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపుడతోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్ చార్జి, కార్యదర్శులు జోక్యం చేసుకొని అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం.